అబ్దుల్లా కుతుబ్ షా దక్షిణ భారతదేశములోని గోల్కొండ రాజ్యమును పరిపాలించిన కుతుబ్ షాహీ వంశములో ఏడవ రాజు. అతడు 1626 నుండి 1672 వరకు పరిపాలించాడు.
సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా కుమారుడైన అబ్దుల్లా, బహుభాషా కోవిదుడు, సంగీత నాట్య ప్రియుడు. అతడు ప్రసిద్ధి చెందిన పదకర్త క్షేత్రయ్యను తన సభకు ఆహ్వానించి సత్కరించాడు. క్షేత్రయ్య మధుర భక్తి సంప్రదాయములో సుప్రసిద్ధుడు. ఈయన పేమమతి తారామతి అనే ఇద్దరు హిందూ యువతులను వివాహం చేసుకున్నాడు. అబ్దుల్లా తరువాత అతని అల్లుడు, అబుల్ హసన్ కుతుబ్ షా, గోల్కొండ రాజు అయినాడు.
1626లో ముహమ్మద్ కులీ కుతుబ్ షా మరణించడంతో అప్పటికి 12 సంవత్సరాల వయస్సులో ఉన్న కుమారుడు అబ్దుల్లా కుతుబ్ షా పట్టాభిషిక్తుడు అయ్యాడు. 1626 ఫిబ్రవరి 1న చార్మినార్ వద్ద అబ్దుల్లాను గోల్కొండ రాజ్యానికి సుల్తాన్‌గా ప్రకటించి, తర్వాతిరోజున మహమెదీ మహల్ వద్ద పట్టాభిషిక్తుణ్ణి చేసి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. సుల్తాన్ చిన్నవయసులో ఉండడంతో రాజప్రతినిధి మండలి ఏర్పడి పరిపాలన చేసేది. రాజప్రతినిధుల మండలిలో ప్రధానమైన అధికారం సుల్తాన్ తల్లి హయత్ బక్షీ బేగం చేతిలో ఉండేది, ఆమెతో పాటుగా సుల్తాన్ నాయనమ్మ ఖానుం ఆఘాకు కూడా సమ ప్రాధాన్యం ఉండేది.[1]
మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఆదేశంతో 1930 డిసెంబరు 3న గోల్కొండ రాజ్యపు ఈశాన్య సరిహద్దుల్లో గోల్కొండకు చెందిన మన్సుర్ ఘర్ అన్న కోటపై మొఘల్ పరిపాలిత ఒరిస్సాకు గవర్నర్‌గా వ్యవహరిస్తున్న బకర్ ఖాన్ సైన్యసహితంగా దండయాత్ర చేశాడు.[2][3] తమకే అన్ని విధాలా అనుకూల్యత ఉన్నా గోల్కొండ సైన్యం మొఘల్ సైన్యం చేసిన తొలి దాడికే లొంగిపోయింది. ఆ ఓటమితో మన్సూర్ ఘర్, ఖిరాపరా ప్రాంతాలను గోల్కొండ రాజ్యం మొఘల్ సామ్రాజ్యానికి కోల్పోయింది.[4] తర్వాతి సంవత్సరంలో షాజహాన్ మరొక మొఘల్ సేన్యాధ్యక్షుడైన నసిరిఖాన్‌ను గోల్కొండ రాజ్యపు వాయవ్య సరిహద్దుల నుంచి దాడిచేయమని ఆదేశించాడు. మొఘల్ సైన్యాలు కాందహార్ కోటను (మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఉంది) హస్తగతం చేసుకున్నాయి. తద్వారా గోల్కొండ రాష్ట్రంలోని తెలంగాణ ప్రావిన్సులో మూడవ వంతు మొఘల్ సామ్రాజ్యం అధీనంలోకి వెళ్ళిపోయింది.[2]
1935-36లో దక్కన్‌లో మరో ముఖ్యమైన రాజ్యమైన అహ్మద్‌నగర్ మీద మొఘల్ సైన్యం దాడి చేసి పతనం చేసింది. స్వయానా షాజహాన్ దక్కన్‌కి వచ్చి అహ్మద్‌నగర్ రాజ్యాన్ని సామ్రాజ్యంలో కలుపుకున్నాడు. గోల్కొండ, బీజాపూర్ సుల్తాన్‌లకు మొఘల్ చక్రవర్తి ఆఖరు హెచ్చరిక పేరిట ఫర్మానా పంపాడు. అహ్మద్‌నగర్‌తో రహస్య ఒప్పందం చేసుకున్నందుకు నిందించడంతో పాటుగా మొఘల్ సామ్రాజ్య ఆధిపత్యాన్ని అంగీరించి, కప్పం కట్టమని లేదంటే గోల్కొండ మీద మొఘల్ సైన్యం దండయాత్ర చేయక తప్పదనీ అందులో షాజహాన్ పేర్కొన్నాడు.[2][3] అప్పటికే మొఘల్ సైన్యపు దాడులకు రాజ్యభాగాలను కోల్పోవడంతో పాటు సాటి సుల్తానేట్ అయిన అహ్మద్‌నగర్ మొఘల్ సామ్రాజ్యంలో కలిసిపోవడంతో అబ్దుల్లా స్వాతంత్ర్యాన్ని నిలబెట్టుకోవడానికి పోరాటం చేసే సాహసం చేయలేదు. 1636లో మొఘల్ సామ్రాజ్య రాయబారి అబ్దుల్ లతీఫ్ ముందు ఖురాన్ మీద ప్రమాణం చేసి, మొఘల్ సామ్రాజ్యానికి సామంతునిగా వ్యవహరిస్తాననీ, మొఘల్ చక్రవర్తి ఆధిపత్యాన్ని అంగీకరిస్తానని, చక్రవర్తి పరిపాలన ప్రారంభమైన సంవత్సరం నుంచీ లెక్కించి ఏడాదికి రెండు లక్షలు పేష్కష్ (కప్పం) చెల్లిస్తాననీ ఇన్‌ఖియద్ నామా లేక సమర్పణా పత్రాన్ని రాసి ఇచ్చాడు.[3][5]
తద్వారా గోల్కొండ రాజ్యపు స్వాతంత్ర్యం ముగిసిపోయింది. అబ్దుల్లా అప్పటి నుంచీ మొఘల్ సామంతుని స్థాయికి దిగిపోయాడు. తన పేరిట కాకుండా మొఘల్ చక్రవర్తి పంపిన నమూనాలో నాణాలను ముద్రించడం ప్రారంభించాడు.[5] మొఘల్ ప్రతినిధి అబ్దుల్లా కొలువులో ఉండేవాడు.[6] సామంతునిగా మారడం వల్ల అబ్దుల్లా చేయబోయే ప్రతీ ముఖ్యమైన రాజకీయ నిర్ణయానికి అప్రకటితమైనది కానీ, గర్భితంమైనది కానీ అసలంటూ మొఘల్ చక్రవర్తి ప్రతినిధి ఆమోదం అవసరం.[7]
తళ్ళికోట యుద్ధం తర్వాత బలహీనమై, రకరకాల రాజధానులు మారుస్తూ పోయిన విజయనగర సామ్రాజ్యంపై 1642 ఏప్రిల్‌లో దండయాత్ర ప్రారంభించడానికి అబ్దుల్లా నిర్ణయించాడు. అందుకు తగ్గట్టుగా మొఘల్ చక్రవర్తి షాజహాన్ కూడా కర్ణాటక ప్రాంతంపై తనకు అధికారం ఉందనీ, కాబట్టి గోల్కొండ, బీజాపూర్ (అప్పటికి మొఘల్ సామంత రాజ్యం అయింది) రాజ్యాలు కర్ణాటకపై దండయాత్ర చేసి గెలిచి తమ రాజ్యాల మధ్య దాన్ని పంచుకొమ్మని ఫర్మానా వెలువరించాడు.[7] అన్నివైపులా దుర్భేద్యమైన రక్షణ కలిగి ఉన్న ఉదయగిరి కోటపై గోల్కొండ రాజ్యం ముట్టడి చేసింది. సాధారణంగా దాన్ని గెలవడం సాధ్యమయ్యేదో కాదో కానీ అబ్దుల్లా అదృష్టం కొద్దీ కొత్తగా రాజ్యానికి వచ్చిన రెండవ శ్రీరంగ రాయల మీద వ్యతిరేకతతో ఉన్న కోట సేనాని మల్లయ్యను గోల్కొండ సైన్యం లొంగదీసుకోగలిగింది. రహస్య మార్గం గుండా కోటలోకి ప్రవేశించి విజయం సాధించింది. బీజాపూర్ సుల్తాన్ ద్వారా సహాయం పొందిన రెండవ శ్రీరంగ రాయలు మళ్ళీ ఉదయగిరి కోటను స్వాధీనం చేసుకోగా, గోల్కొండ సైన్యాధ్యక్షుడు రెండవ మీర్ జుమ్లా తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. ఈసారి కడప ప్రాంతాన్ని రెండవ మీర్ జుమ్లా తన కిందే ఉంచుకున్నాడు. ఆపైన శాన్ తోమ్, చెంగల్పట్టు ప్రాంతాన్నీ జయించాడు. 1646 నాటికల్లా విజయనగర ఆఖరి పాలకుడైన రెండవ శ్రీరంగ రాయల పరిపాలనలో ఉన్న మొత్తం ప్రాంతం గోల్కొండ పాలైంది.[8]
విజయనగర సామ్రాజ్యాన్ని అంతం చేయడంలో కీలకమైన పాత్ర పోషించిన అబ్దుల్లా వజీర్ రెండవ మీర్ జుమ్లా పోను పోను తన సుల్తాన్‌కి సమస్యాత్మకంగా తయారయ్యాడు. మీర్ జుమ్లా దక్కన్‌లో మొఘల్ గవర్నర్‌గా ఉన్న ఔరంగజేబుతో రహస్యంగా మంతనాలు సాగిస్తూ, అతన్ని గోల్కొండపై దండయాత్రకు రమ్మని ఆహ్వానించిన విషయం అబ్దుల్లాకు తెలిసింది.[8] మీర్ జుమ్లాను తన కొలువులో హాజరు కావాలని పంపిన ఆదేశానికి సమాధానం లేకపోవడంతో అబ్దుల్లా అతని కుమారుడిని, భార్యని ఖైదుచేసి, యావదాస్తిని జప్తుచేశాడు. అవతల మీర్ జుమ్లా మొఘల్ కొలువును అంగీకరించాడు, ఔరంగజేబు సహకారంతో షాజహాన్ నుంచి 5 వేలమంది సైన్యానికి మన్సబుదారుగా తనకూ, 2 వేలమంది సైన్యానికి మన్సబుదారుగా తన కుమారుడికీ హోదా పొందాడు. మీర్ జుమ్లా కుటుంబాన్ని విడిపించం అసలు కారణం కాగా మొఘల్ సామ్రాజ్యానికి రావాల్సిన పేష్కష్ బాకీ కోసం అన్న వంకతో ఔరంగజేబు గోల్కొండపైకి సైన్యాన్ని నడిపిస్తున్నట్టు ప్రకటించాడు. ఇందుకు తన కుమారుడిని సైన్య సహితంగా వెళ్ళమని ఆదేశించాడు. ఈ పరిణామంతో భయపడిపోయిన అబ్దుల్లా హైదరాబాద్‌ను విడిచిపెట్టి గోల్కొండ కోటలో దాక్కున్నాడు. దానితో పాటు మీర్ జుమ్లా కుమారుడిని, భార్యను విడిచిపెట్టాడు. ఐనా, ఔరంగజేబు కుమారుడు మహమ్మద్ మాత్రం వెనుదిరగలేదు. గోల్కొండ కోటను ముట్టడించి కూర్చున్నాడు. ధైర్యం సన్నగిల్లిన అబ్దుల్లా ఓటమిని అంగీకరించి శాంతిని కోరాడు. సంధి షరతుల్లో భాగంగా కోటి రూపాయలు చెల్లించాడు.[9] పాద్షా బీబీ సాహెబా అన్న పేరుతో పేరొందిన తన కుమార్తెను ఔరంగజేబు పెద్ద కొడుకు మహమ్మద్ సుల్తాన్ మీర్జాకు ఇచ్చి పెళ్ళిచేశాడు.[10] ఈ పరిణామాలు 1656లో జరిగాయి.
1658లో షాజహాన్ అనారోగ్యం పాలు కావడంతో సింహాసనం కోసం షాజహాన్ కుమారుల్లో అంతర్యుద్ధం జరిగి, అందులో గెలిచి ఔరంగజేబు వారసునిగా స్థిరపడేవరకూ మొఘల్ రాజకీయ వ్యవహారాల అస్థిరత్వంలోకి వెళ్ళాయి.[11] మరోవైపు, ఔరంగజేబు దక్కన్‌లో శివాజీ నేతృత్వంలో మరాఠా రాజ్యంతో పోరాటాల్లో మునిగితేలాడు. దీనితో కుతుబ్ షాహీ రాజ్యానికి వెనువెంటనే వచ్చిన ముప్పేమీ లేకపోయింది. కానీ, విజయనగరం నుంచి గెలుచుకున్న భూభాగం విషయమై వివాదం తలెత్తింది. అది గోల్కొండకు వజీరుగా ఉండగా మీర్ జుమ్లా గెలిచింది కాబట్టి గోల్కొండ భూభాగమేనని అబ్దుల్లా వాదించాడు. తనకు సన్నిహితుడైన మీర్ జుమ్లా ప్రభావంతో ఔరంగజేబు చక్రవర్తి మాత్రం మీర్ జుమ్లా మొఘల్ ఉద్యోగి అనీ, కాబట్టి ఆ భూభాగాలపై అబ్దుల్లాకు అధికారం లేదని తేల్చాడు. చక్రవర్తి ఔరంగజేబు దక్కన్‌లో మిగిలిన సుల్తానులను వదిలించుకుని ఆ భూభాగాన్ని మొఘల్ సామ్రాజ్యంలో కలుపుకోవడానికి కృత నిశ్చయుడై ఉండడంతో 1665లో బీజాపూర్ సుల్తాన్ మీదికి దండయాత్రకు ఆదేశించాడు. ఈ పరిస్థితుల్లో అబ్దుల్లా తన బావ అయిన బీజాపూర్ ఆదిల్షాకు మద్దతుగా నిలవాలని నిర్ణయించుకుని, గోల్కొండ సైన్యాధికారియైన మూసా ఖాన్‌ను 12 వేల మందితో తుపాకీ దళంతో మొఘల్ సైన్యంపై దాడిచేయమని ఆదేశించాడు.[10][12]
ఔరంగజేబు మొఘల్ చక్రవర్తిగా పట్టాభిషిక్తుడైన తర్వాత ఒకసారి అబ్దుల్లా కుతుబ్ షాని ఎప్పటిలానే మొఘల్ రాజ ప్రతినిధిని తన కొలువులో ఉంచమని ఆదేశించగా, ఆ ఆదేశాన్ని అబ్దుల్లా తిరస్కరించాడు. ఖైదులో జీవిస్తున్నా షాజహాన్ జీవించే ఉండడంతో ఔరంగజేబు ధర్మబద్ధంగా చక్రవర్తి కాబోడనీ, ఇప్పటికీ షాజహానే చక్రవర్తి అనీ, కాబట్టి ఔరంగజేబు ఆదేశాలు తాను స్వీకరించనక్కరలేదనీ ఒక వాదన కూడా చెప్పాడు. మొఘల్ రాజప్రతినిధిని తన కొలువులో అవమానించాడు. దీనితో మొఘల్ సైన్యం మీదికి దండయాత్ర చేసి, అబ్దుల్లాను ఓడించింది. అలా కుదుర్చుకున్న సంధిలో కారణంగా అబ్దుల్లా మొఘల్ సామ్రాజ్యానికి లోబడి సామంతునిగా ఉండేట్టు అంగీకరించి గోల్కొండ రాజ్యానికి తిరిగి పాలకుడయ్యాడు.[6]
అబ్దుల్లా కుతుబ్ షా పరిపాలన చాలా ఇబ్బందుల్లో సాగింది. సైనికంగా చాలా బలహీనమైన పాలకుడిగా కనిపిస్తాడు. అయితే, సుల్తాన్ గా అతని బాధ్యతల్లో ఒకటైన న్యాయ నిర్ణయం విషయంలో అబ్దుల్లాకు చాలా మంచి పేరు ఉంది. న్యాయబుద్ధికి, న్యాయాన్యాయ విచక్షణకీ అతను పేరుపొందాడు. ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నవారైనా అన్యాయంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకోవడానికి వెనుకాడేవాడు కాదు.[13]
తెలుగు భాష పోషణ విషయంలో కుతుబ్ షాహీలు పేరు పొందినా సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా కాలంలో దీనికి ఎదురుదెబ్బ తగిలింది. అయితే, అబ్దుల్లా తెలుగు భాషా సాహిత్యాల పోషణను పునరుద్ధరించాడు.[14] మత సామరస్యాన్ని కూడా పాటించాడు, హిందూ ముస్లింలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి తన చర్యలతో దోహదం చేశాడు.[15] అబ్దుల్లా కాలంలో గోల్కొండ రాజ్యంలో ద్విభాషా ఫర్మానాలు వెలువడ్డాయి, వీటిలో పర్షియన్ భాషలో సారాంశం, తెలుగులో పూర్తి పాఠం ఉండేవి.[16] అబ్దుల్లా కుతుబ్ షా పరిపాలనలో గోల్కొండ రాజ్యంలో మల్లారెడ్డి దేశాయ్, కేశన-మల్లన వంటి తెలుగు కవులు కావ్యాలు రాశారు.[17] అబ్దుల్లా కాలంలోనూ గోల్కొండ రాజ్యంలో పర్షియన్ సాహిత్య పోషణ ఎంతగానో జరిగింది. అతని పాలనలో ఇక్కడ అనేకానేక పర్షియన్ రచనలు వచ్చాయి. 1651లో అబ్దుల్లా పాలనలో మహమ్మద్ హుసేన్ బుర్హాన్ రూపొందించిన బుర్హాన్-ఇ-ఖాతీ అన్న పర్షియన్ నిఘంటువు ఈనాటికీ పర్షియన్ భాషలో ప్రామాణికమైన నిఘంటువుగా పేరొందింది. మరెన్నో పర్షియన్ రచనలు, చెప్పుకోదగ్గ ఉర్దూ సాహిత్యం అబ్దుల్లా పోషణలో వెలువడింది.[18]
రెండవ మీర్ జుమ్లా చేతిలో మోసపోయి అనేక సమస్యల పాలైన కారణంగా చివరి దశలో తనకు నమ్మకస్తులైన వారిని పరిపాలనలో నియమించుకోవాలని అబ్దుల్లా నిర్ణయించుకున్నాడు. దాని ప్రకారమే ప్రతిభావంతుడైన తెలుగు బ్రాహ్మణ ఉద్యోగి మాదన్నను ప్రోత్సహించాడు. రాజ్యంలోని అన్ని కీలకమైన ఉద్యోగాల్లోనూ మాదన్నకు నమ్మకస్తులైన వ్యక్తులను నియమించమని అతనికి అవకాశం కల్పించాడు. క్రమేపీ అతన్ని బలపరుస్తూ వచ్చి, తుదకు సయ్యద్ ముజఫర్‌ను తొలగించి, మీర్ జుమ్లా (ఆర్థిక మంత్రి) పదవిలో మాదన్నను నియమించాడు. మాదన్న సైన్యంలోనూ, పరిపాలనలోనూ వివిధ ఉన్నత పదవుల్లో తనకు నమ్మకస్తులైన దగ్గరి బంధువులను, కుటుంబ సభ్యులను నియమించాడు.[19]
మహమ్మద్ కుతుబ్ షా సమయంలోనే గోల్కొండ రాజ్యంలో వజ్రాల గనులు ఉన్న విషయం బయటపడినా, గనులను వెలికితీసి దాన్ని పూర్తిస్థాయి పరిశ్రమగా తీర్చిదిద్దింది అబ్దుల్లా పరిపాలన వ్యవస్థే. అబ్దుల్లా వజ్రాల గనుల నిర్వహణ, వెలికితీత ప్రక్రియ, అమ్మకం వగైరా మొత్తం వజ్రాల పరిశ్రమ ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకువచ్చాడు.[20] వజ్రాల వెలికితీత ఎంత ముమ్మరంగా ఉండేదంటే వాటిని లెక్కించేప్పుడు ఒక్కో వజ్రాన్నీ కాక వజ్రాల మూటలుగా లెక్క పెట్టేవారు. అబ్దుల్లా కిరీటంలో ప్రపంచంలోనే అత్యుత్తం అనదగ్గ వెలకట్టలేని వజ్రాలు ఉండేవి.[21]
అబ్దుల్లా పరిపాలనలో కుతుబ్ షాహీ నిర్మాణ కౌశలం అత్యుత్తమ దశకు చేరుకుంది. తన జీవితకాలంలో అబ్దుల్లా అనేక మసీదులను కళాత్మకంగా నిర్మింపజేశాడు. హయత్‌నగర్ మసీదు, హతీ బౌలీ, ఖాస్ బాఘ్, ఇబ్న్-ఖాటూన్ సమాధి మందిరం, టోలీ మసీదు, ఘోషా మహల్, కుతుబ్-ఎ-ఆలమ్ మసీదు, మూసా బురుజు, గోల్కొండ టూంబ్స్‌కు సంబంధించిన గొప్ప మసీదు, హయత్ బక్ష్ బేగం సమాధి మందిరం, హీరా మసీదు, అబ్దుల్లా కుతుబ్ షా సమాధి మందిరం అన్నవి అబ్దుల్లా పాలనాకాలంలో నిర్మించిన గొప్ప నిర్మాణాలు.[22]
అబ్దుల్లా కుతుబ్ షాకి ముగ్గురు కుమార్తెలు:[23]
అబ్దుల్లా చివరకు 1672లో మరణించాడు.[6] అతనికి వారసునిగా గోల్కొండ సామ్రాజ్యాన్ని అతని మూడవ అల్లుడు అబుల్ హసన్ పట్టాభిషిక్తుడయ్యాడు.[24]
{{cite book}}
: CS1 maint: unrecognized language (link)
Khamrunnisa Begum (1984). Social and Economic conditions under the Qutb Shahi dynasty A D 1518 1687 (in English).{{cite book}}
: CS1 maint: unrecognized language (link)