ఆడపెత్తనం (1958 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఆదుర్తి సుబ్బారావు |
---|---|
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, అంజలీ దేవి, కన్నాంబ, రేలంగి, సూర్యకాంతం |
సంగీతం | ఎస్.రాజేశ్వరరావు, మాస్టర్ వేణు |
నిర్మాణ సంస్థ | ప్రభా ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
ప్రభా ప్రొడక్షన్స్ వారి ఆడపెత్తనం 1958, ఆగష్టు 6న విడుదలయ్యింది.ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి , పసుపులేటి కన్నాంబ,రాజసులోచన మున్నగు వారు నటించారు. ఈ చిత్రానికి సంగీతం సాలూరు రాజేశ్వరరావు , మాస్టర్ వేణు అందించారు.
మువ్వల రంగమ్మ నోటి దురుసు తనం వల్ల మొగుణ్ణి అలుసు చేసి పెత్తనం చెలాయిస్తూ వుంటుంది. ఆమె సవతి కొడుకు కృష్ణ సెలవులకు బస్తీ నుంచి ఇంటికి వస్తాడు. తన మేనమామ కూతురు రాధను పెళ్లి చేసుకోవాలని అతను మనసు పడతాడు. కానీ తన కొడుకును రాధకు చేసుకోవాలంటే పదివేలు కట్నం ఇవాలని శాసిస్తుంది రంగమ్మ. ఆ డబ్బుతో తన కూతురు పెళ్లికి కట్నం ఇవ్వవచ్చని ఆమె అభిప్రాయం. పిల్ల సుఖం కోరి రాధ తండ్రి తన పొలాన్ని ఊరు మోతుబరికి అమ్మి పదివేలు తెస్తాడు. కానీ ఆ పెద్ద మనిషికి రాధ మీద మనసవుతుంది. ఈ పెళ్ళి చెడగొడితే రాధను తను చేసుకోవచ్చన ఊహ కొద్దీ అతడు తను పగటి పూట ఇచ్చిన పదివేలను రాత్రి దొంగతనం చేయిస్తాడు. పెళ్ళి చెడిపోవడంతో రంగమ్మ రాధను, ఆమె తండ్రినీ ఆడిపోసుకుంటుంది. ఆ వేడిలో రాధ తండ్రి రాధను రెండవ పెళ్ళివాడైన మోతుబరికే ఇచ్చి పెళ్ళి చేయబోతాడు.దానితో రాధ ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది. కృష్ణ సమయానికి వచ్చి అడ్డుకుని దేవుని సమక్షాన రాధ మెడలో తాళి కడతాడు. ఆ క్షణం నుండి తన కుటుంబంతో సంబంధాలు తెంచుకుని భార్యను పట్నం తీసుకుపోతాడు. రంగమ్మ ఇంట్లో లోకం అనే నాటకాలరాయుడు అద్దెకు దిగుతాడు. క్రమంగా ఆ ఇంటి అల్లుడై మామగారి మరణంతో పుంజుకుని, అత్తగారిని వంచించి ఆస్తిని కాజేసి బస్తీ పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ వేళకు రాధా, కృష్ణా, ఊరివాళ్ళూ ఆ ప్రమాదం నివారిస్తారు. చివరకు మువ్వల రంగమ్మలో పరివర్తన రావడంతో కథ ముగుస్తుంది.[1]