ఆపరేషన్ జిబ్రాల్టర్ | |||||||
---|---|---|---|---|---|---|---|
1965 భారత పాకిస్తాన్ యుద్ధంలో భాగంలో భాగము | |||||||
| |||||||
ప్రత్యర్థులు | |||||||
India | Pakistan | ||||||
సేనాపతులు, నాయకులు | |||||||
జనరల్ జె.,ఎన్.చౌధురిJoyanto Nath Chaudhuri బ్రిగే. జెడ్.సి.బక్షీ[1] | మే.జ. అఖ్తర్ హుసేన్ మాలిక్ | ||||||
బలం | |||||||
100,000 – 200,000 | 5,000 – 40,000 | ||||||
ప్రాణ నష్టం, నష్టాలు | |||||||
Unknown | Unknown |
ఆపరేషన్ జిబ్రాల్టర్ అనేది జమ్మూ కాశ్మీరులో కల్లోలం సృష్టించి, భారత్‌కు వ్యతిరేకంగా విప్లవం లేవదీయాలనే పాకిస్తాన్ వ్యూహానికి ఆ దేశం పెట్టుకున్న పేరు. ఈ ఆపరేషన్ పెద్ద వైఫల్యంగా మిగిలిపోయింది. స్పెయిన్‌ను ఆక్రమించుకోవడం కోసం అరబ్బులు జిబ్రాల్టర్ రేవు నుండి మొదలుపెట్టిన దాడిని తలపించేలా పాకిస్తాన్ ఈ ఆపరేషన్‌కు ఆ పేరు పెట్టుకుంది.[2]
1965 ఆగస్టులో పాకిస్తాన్ సైన్యానికి చెందిన ఆజాద్ కాశ్మీరు బలగాలు[3][4] స్థానికుల వేషాల్లో జమ్మూ కాశ్మీరులోకి చొరబడ్డారు. కాశ్మీరు ముస్లిముల్లో వేర్పాటు భావాలను రెచ్చగొట్టే ఉద్దేశంతో వీరు చొరబడ్డారు. అయితే, సరైన సమన్వయం లేక వీళ్ళ అసలు రూపాలు బయటపడి, పథకం మొదట్లోనే బెడిసికొట్టింది. ఈ ఆపరేషన్ 1965 నాటి భారత పాకిస్తాన్ యుద్ధానికి దారితీసింది.
1947 లో దేశ విభజన సమయంలో సరిహద్దులను నిశ్చయించే కమిషను నేత సిరిల్ రాడ్‌క్లిఫ్, ముస్లిములు ఎక్కువగా నివసించే ప్రాంతాలను పాకిస్తాన్‌లో చేరుస్తూ సరిహద్దులను నిశ్చయించాడు. కానీ జమ్మూ కాశ్మీరు, గుర్దాస్‌పూర్, ఫెరోజ్‌పూర్ వంటి ప్రాంతాల్లో ముస్లిములు మెజారిటీగా ఉన్నప్పటికీ, ఆయా సంస్థానాధీశులు కోరుకున్నందువలన వాటిని భారత్‌లో కలిపాడు. ఇది 86% ముస్లిములున్న కాశ్మీరులో తీవ్ర వ్యతిరేకత రేకెత్తించింది. కాశ్మీరుపై భారత పాక్ యుద్ధాలకు ఇది ప్రాతిపదిక. 1962 భారత చైనా యుద్ధం తరువాత భారత సైన్యం పునర్నిర్మాణ దశలో ఉన్నపుడు, దాడికి అది సదవకాశంగా పాకిస్తాన్ భావించింది.
సంఖ్యాపరంగా తక్కువగా ఉన్నప్పటికీ, పాకిస్తాన్ వాయుసేన, ఆర్మరీ రెండూ నాణ్యతాపరంగా భారత్ కంటే మెరుగ్గా ఉన్నాయి.[5] 1965 నాటి రాన్ ఆఫ్ కచ్ ఘటనలో పాకిస్తాన్‌కు కాస్త అనుకూల ఫలితం రావడం కూడా పాకిస్తాన్‌కు ప్రోత్సాహం కలిగించింది. పైగా 1963 డిసెంబరులో శ్రీనగర్ లోని హజరత్‌బల్ మసీదు నుండి పవిత్ర జ్ఞాపిక అదృశ్యమవడంతో కాశ్మీరంతటా[6] ముస్లిముల్లో అశాంతి రేకెత్తింది. తిరుగుబాటు చేసేందుకు ఇది అనుకూల సమయంగా పాకిస్తాను భావించింది.[7] ఈ అంశాలన్నీ, దొంగచాటు దెబ్బతీసేందుకు, పూర్తిస్థాయి యుద్ధం అనే భయాన్ని కలిగించేందుకూ, తద్వారా కాశ్మీరుపై ఒక పరిష్కారం సాధించేందుకూ ఇది మంచి సమయంగా పాకిస్తాన్ నేతలు భావించారు.[8][9][10]
బలగం పేరు | ఆపరేషన్ ప్రాంతం |
సలాహుద్దీన్ | శ్రీనగర్ లోయ |
ఘజ్నవీ | మెహందర్-రాజౌరీ |
తారిఖ్ | కార్గిల్-ద్రాస్ |
బాబర్ | నౌషేరా-సుందర్‌బానీ |
ఖాసిమ్ | బందీపురా-సోనార్‌వైన్ |
ఖాలిద్ | ఖాజీనాగ్-నౌగావ్ |
నస్రత్ | తిత్వాల్-తంగ్‌ధార్ |
సికందర్ | గురేజ్ |
ఖిల్జీ | కేల్-మినిమార్గ్ |
పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ మొదట్లో వ్యతిరేకించినప్పటికీ ఆపరేషన్ను మొదలుపెట్టారు. 1965 జూలై, ఆగస్టుల్లో పాకిస్తాన్ బలగాలు పీర్ పంజల్ పర్వతాల వద్ద నియంత్రణ రేఖను దాటి గుల్మార్గ్, యూరి, బారాముల్లా లోకి ప్రవేశించాయి. భారతీయ వర్గాల ప్రకారం 30,000[11] – 40,000 మంది పాకిస్తాన్ సైనికులు సరిహద్దు దాటి భారత్‌లోకి చొరబడ్డారు. పాకిస్తానీ వర్గాలు ఈ సంఖ్యను 5,000 -7,000 మాత్రమే అని పేర్కొన్నాయి.[12] "జిబ్రాల్టర్ ఫోర్స్" అని పిలిచే ఈ బలగాలు[1] మేజర్ జనరల్ అఖ్తర్ హుసేన్ మాలిక్ నేతృత్వంలో నడిచాయి. ఈ సేననును 9 బలగాలుగా (ఒక్కొక్క దానిలో 5 కంపెనీలు) విభజించారు. ఒక్కో దానికీ ఒక్కో చారిత్రిక ముస్లిము పాలకుని పేరుతో ఒక్కో సంకేత నామం పెట్టారు.
చొరబాటుదార్లు స్థానికులలో కలిసిపోయి తిరుగుబాటుకై వారిని రెచ్చగొడతారు. ఈలోగా వారు గెరిల్లాయుద్ధ పద్ధతిలో వంతెనలు, సొరంగాలు, రోడ్లు, విమానాశ్రయాల పైనా దాడి చేస్తారు.[13] దీంతో కాశ్మీరులో సాయుధ విప్లవ పరిస్థితులు నెలకొని, దేశవ్యాప్తంగా తిరుగుబాటు జరుగుతుంది - ఇదీ పాకిస్తాన్ పాలకుల ప్రణాళిక. భారత్ దీన్ని ఎదుర్కోలేదని,[14] పూర్తిస్థాయి యుద్ధానికి అసలే సిద్ధపడదనీ, తద్వారా కాశ్మీరు ఆక్రమణ త్వరితంగా నెరవేరుతుందనీ వాళ్ళు భావించారు. మొత్తం 9 దళాల్లోనూ మేజర్ మాలిక్ మునావర్ ఖాన్ అవాన్ నేతృత్వంలోని దళం మాత్రమే మెహందర్-రాజౌరీ ప్రాంతంలో తమ లక్ష్యాన్ని చేరుకోగలిగింది. [15][16][17][18]
ఈ ఆపరేషన్ పూర్తి వైఫల్యం చెందినప్పటికీ, అసలీ పథకమే లోపభూయిష్టమనే అబిప్రాయంపై సైనిక విశ్లేషకులు విభేదిస్తారు. పథకం సరైనదే అయినప్పటికీ, అమలు సరిగ్గా జరగలేదని కొందరన్నారు. కానీ, పాకిస్తానీ తటస్థ పరిశీలకులంతా ఇదొక మొరటు ప్రయత్నమని అంగీకరించారు. [19] కాశ్మీరీ ప్రజలు భారత ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారని, పాకిస్తాన్ సైనికుల మద్దతు లభించగానే భారత్‌పై తిరుగుబాటు చేస్తారనీ భావించడంతోటే పాకిస్తాన్ సైన్యపు వైఫల్యం మొదలైంది. కాశ్మీరీ ప్రజలు తిరుగుబాటు చెయ్యక పోగా, ఈ పాకిస్తాన్ చొరబాటుదార్ల గురించి వాళ్ళు భారత సైన్యానికి తెలియజేసారు. దాంతో తాము ఎదుర్కొంటున్నది పాకిస్తాన్ సైనికులనేనని భారత సైన్యానికి అర్థమైపోయింది.[20]
వివిధ సైనిక బలగాల మధ్య సమన్వయం కూడా కొరవడింది.[21] పాకిస్తాన్ రచయిత ఇక్బాల్ చీమా ప్రకారం, సైనిక దళాధిపతి మొహమ్మద్ మూసా, ఈ పథకం కచ్చితంగా విజయవంతమౌతుందని, ఇతర సైనిక బలగాల జోక్యం అవసరం ఉండదనీ భావించి, ఈ ఆపరేషన్ సంగతి వాయుసేనకు అసలు చెప్పనే లేదు. పాకిస్తాన్ సైనికాధికారులకు, రాజకీయ నాయకులకూ కూడా ఈ సంగతి తెలియదు. అంటే, ఈ పథకం భారత్‌ను ఎంత ఆశ్చర్యపరచిందో పాకిస్తాన్‌ను కూడా అంతే ఆశ్చర్యపరచింది.[22] ఈ పథకం విఫలమైతే, భారత్‌తో పూర్తి స్థాయి యుద్ధానికి దారితీస్తుందనీ, అది వాంఛనీయం కాదనీ భావించిన చాలామంది సీనియర్ అధికారులు, ఈ పథకాన్ని వ్యతిరేకించారు.[23][24][25][26]