ఐ.సి.ఎల్. అని సంక్షిప్తంగా పిలువబడే ఇండియన్ క్రికెట్ లీగ్ (The Indian Cricket League-ICL) భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు పోటీగా సమాంతరంగా ఏర్పడిన క్రికెట్ క్రీడా సంస్థ. ట్వంటీ-20 పద్ధతిలో క్రికెట్ పోటీలు నిర్వహించబడే ఈ సంస్థ 2007లో ఏర్పడి అదే ఏడాదే చండీగఢ్ లోని తావూ దేవీలాల్ పంచకుల స్టేడియంలో పోటీలకు కూడా నిర్వహించింది. ప్రారంభంలో 6 జట్లను ఏప్రాటుచేసిన ఈ లీగ్ 2008లో మరో రెండు జట్లను కొత్తగా ఏర్పర్చి మొత్తం జట్ల సంఖ్యను 8కి చేర్చింది. అహ్మదాబాద్ రాకెట్స్, లాహోర్ బాద్షాస్ జట్లు కొత్తగా ఏర్పాటైనవి. లాహోర్ బాద్షాస్ అందరూ పాకిస్తాన్కు చెందిన క్రీడాకారులే ఉన్న జట్టు. జీ టెలిఫిల్మ్స్ సంస్థ అధినేత సుభాష్ చంద్ర దీన్ని ఏర్పాటు చేశాడు. కపిల్ దేవ్, కిరణ్ మోరేలు ఈ లీగ్‌లో చేరిన ప్రముఖులు. బ్రియాన్ లారా, ఇంజమామ్ ఉల్ హక్ లాంటి మేటి క్రీడాకారులు ఈ లీగ్‌లోని జట్లకు నాయకత్వం వహిస్తున్నారు.
సుభాష్ చంద్ర యొక్క ఎస్సెల్ గ్రూప్‌లోని భాగమైన జీ టెలిఫిల్మ్స్ 2003 ప్రపంచ కప్‌కు అధిక మొత్తంలో బిడ్ వేసిననూ ఫలితం దక్కలేదు. 2004లో సుభాష్ చంద్ర మళ్ళీ బిడ్ వేశాడు. 2006 నుంచి 2010 వరకు ప్రసార హక్కుల కొరకు బిడ్ వేసిననూ ఓడిపోయాడు. ఈ ఫలితాలే ఇండియన్ క్రికెట్ లీగ్ ఏర్పాటుకు దారితీశాయి. క్రికెట్ పోటీలో నిందకు గురైనందుకే లీగ్ ప్రారంభించినట్లు ఐ.సి.ఎల్., జీ స్పోర్ట్స్ వ్యాపార అధినేత హిమాంశు మోడి పేర్కొన్నాడు.[1] 100 కోట్ల రూపాయల కార్పస్‌తో ప్రారంభించబడిన ఈ లీగ్ విజేతకు ఒక మిలియన్ అ.డాలర్లు. ప్రారంభంలో ప్రముఖ క్రికెటర్లు ఇందులోకి రావడానికి మొగ్గుచూపలేదు. కాని క్రమక్రమంగా ప్రముఖ ఆటగాళ్ళు కూడా చేరుతూవచ్చారు. ఇదే క్రమంలో జూలై 24, 2007నవెస్టీండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ఈ లీగ్‌లో చేరడం జరిగింది.[2] పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఆటగాళ్ళు లీగ్‌లో ఆడకుండా అడ్డుపడింది. జావేద్ మియాందాద్ లాంటి ఆటగాళ్ళు కూడా పాకిస్తాన్ వైఖరిని తప్పుపట్టారు. లీగ్‌లోచేరిన ఆటగాళ్ళను దేశవాళి టర్నమెంట్లలో ఆడకుండా నిషేధించింది. బిసిసిఐ కూడా లీగ్‌లో చేరిన ఆటగాళ్ళను జాతీయ జట్టులో చేర్చుకోమని ప్రకటించింది. టోర్నమెంట్లు నిర్వహించడానికి స్టేడియాలు ఇవ్వడానికి కూడా బిసిసిఐ ఒప్పుకోలేదు. ప్రారంభంలో అన్ని పోటీలు చండీగర్‌లోని (పంచకుల) తావూ దేవీలాల్ స్టేడియంలో నిర్వహించారు. 2008లో హైదరాబాదులోని లాల్ బహదూర్ స్టేడియంలో పోటీలు ప్రారంభమయ్యాయి.
ప్రారంభంలో 6 జట్లను ప్రకటించింది. ఆ తరువాత 2008లో మరో రెండు జట్లను కూడా దీనితో జతచేశారు. ప్రస్తుతం మొత్తం జట్ల సంఖ్య 8 కి చేరింది. ప్రతి జట్టులో 4 అంతర్జాతీయ ఆటగాళ్ళు, ఇద్దరు భారతీయులు, 8 దేశవాళి ఆటగాళ్ళు ఉంటారు. కాని కొత్తగా చేరిన లాహోర్ బాద్షాస్ జట్టులో అందరూ పాకిస్తాన్ ఆటగాళ్ళే ఉన్నారు. నవంబర్ 2007లో తొలిసారిగా పోటీలు నిర్వహించారు.
ప్రతి జట్టు ఒక మెంటర్, ఒక మీడియా మేనేజర్, సైకాలజిస్ట్, ఫిజియోథెరాపిస్ట్‌ను కలిగి ఉండవచ్చు. గెలిచిజ జట్టుకు ఒక మిలియన్ అమెరిక డాలర్ల నగదు బహమతి ప్రధానం చేస్తారు. అన్ని పోటీలు ట్వంటీ-20 పద్ధతిలో జరిగుతాయి. ఆటగాళ్ళ వివాదాలను అంబుడ్స్‌మెన్ పరిష్కరిస్తుంది.