ఇందుమతి చిమన్‌లాల్ షేత్ | |
---|---|
జననం | 1906 అహ్మదాబాద్, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం గుజరాత్, భారతదేశం) |
మరణం | 1985 (aged 78–79) |
వృత్తి | భారతీయ స్వాతంత్ర్యోద్యమరాలు, రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త, విద్యావేత్త |
తల్లిదండ్రులు |
|
పురస్కారాలు | పద్మశ్రీ (1970) |
ఇందుమతి చిమన్‌లాల్ షేత్ గుజరాత్‌కు చెందిన భారతీయ స్వాతంత్ర్యోద్యమరాలు, రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త, విద్యావేత్త. అహ్మదాబాద్‌లో జన్మించి, మహాత్మా గాంధీచే ప్రభావితమైన ఆమె స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని, బొంబాయి రాష్ట్రానికి ఉప విద్యా మంత్రిగా, గుజరాత్ విద్యా మంత్రిగా పనిచేసింది. ఆమెకు సామాజిక సేవకు గానూ 1970లో పద్మశ్రీ పురస్కారం లభించింది.
ఇందుమతి 1906, నవంబర్ 28వ తేదీన అహ్మదాబాద్‌లో మానెక్బా, చిమన్‌లాల్ నాగిందాస్ షేత్ దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి 1908లో మరణించాడు. ఆమె తల్లి ఒక హాస్టల్, పాఠశాలను స్థాపించింది. అంబాలాల్ సారాభాయ్ ఆమె తండ్రికి బంధువు. ఆమె ప్రాథమిక విద్యను అహ్మదాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేసింది. బాంబే ప్రెసిడెన్సీలో మొదటి స్థానంలో నిలిచి, చాట్‌ఫీల్డ్ బహుమతితో ఆమె 1921లో మెట్రిక్యులేషన్ చేసింది. ఆమె 1926లో మహాత్మా గాంధీచే ప్రభావితమై, గుజరాత్ విద్యాపీఠం నుండి పట్టభద్రురాలైంది.[1]
ఆమె కొంతకాలం గుజరాత్ విద్యాపీఠంలో గౌరవ అధ్యాపకురాలిగా పనిచేసింది. ఆమె తన తల్లి స్థాపించిన సంస్థల నుండి ఏర్పడిన షేత్ చిమన్‌లాల్ నాగిందాస్ విద్యాలయంలో చేరి బోధించింది. 1920లలో సహాయ నిరాకరణ ఉద్యమంలో, 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొంది, దీని వలన ఆమె జైలు శిక్ష అనుభవించింది. 1942లో అహ్మదాబాద్‌లో జరిగిన అల్లర్ల సమయంలో శాంతి కోసం కృషి చేసింది.[1][1][1][2][3][4]
విద్య, ఉపాధి ద్వారా మహిళలను ఉద్ధరించడానికి ఆమె సమ్మున్నతి ట్రస్ట్, మహిళా ముద్రణాలయాన్ని స్థాపించింది. ఆమె అహ్మదాబాద్‌లోని మహిళా సాధికారతకు పునాది అయిన జ్యోతిసంఘ్‌లో సభ్యురాలు. ఆమె స్వదేశీ (స్థానిక ఉత్పత్తులు) ని ప్రోత్సహించింది, ఖాదీ వస్త్రాల ప్రచారం కోసం అహ్మదాబాద్‌లో ఖాదీ మందిర్‌ను స్థాపించింది. ఆమె గుజరాత్‌లోని విశ్వవిద్యాలయం సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం కమిటీలో పనిచేసింది.[1][4][5][6][7][2]
చిమన్‌లాల్ షేత్ భారత జాతీయ కాంగ్రెస్‌తో అనుబంధం కలిగి ఉంది. ఆమె 1937లో అహ్మదాబాద్ మున్సిపల్ స్కూల్ బోర్డ్ సభ్యురాలిగా ఎన్నికైంది. 1946లో, బొంబాయి శాసనసభకు ఏకగ్రీవంగా ఎన్నికయింది. స్వాతంత్ర్యం తరువాత, ఆమె 1952 నుండి 1960 వరకు బొంబాయి రాష్ట్ర ఉప విద్యా మంత్రిగా పనిచేసింది. 1961లో, ఫిజికల్ ఇన్‌స్ట్రక్టర్‌లకు శిక్షణ ఇవ్వడం కోసం ఆమె వ్యాయామ విద్యాభవన్‌ను స్థాపించింది, కొత్తగా స్థాపించబడిన గుజరాత్ రాష్ట్రంలో మొదటి ఫైన్ ఆర్ట్స్ కాలేజీని స్థాపించింది. ఆమె ఎల్లిస్ బ్రిడ్జ్ నియోజకవర్గం నుండి ఎన్నికయింది. 1962 నుండి 1967 వరకు గుజరాత్ రాష్ట్ర విద్య, సాంఘిక సంక్షేమం, ఎక్సైజ్, పునరావాస మంత్రిగా పనిచేసింది. 1969లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సభ్యురాలిగా నియమితులయింది. ఇందుమతి చిమన్‌లాల్ షేత్ 1985, మార్చి 11వ తేదీన మరణించింది.[1][8][9][10]
ఆమె చేసిన సామాజిక సేవకు గానూ 1970లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది.[1][1][8][11]
గుజరాతీ రచయిత్రి స్నేహరష్మి చిమన్‌లాల్ షేత్ జీవిత చరిత్రను గుజరాతీలో సంస్కారమూర్తి ఇందుబెన్ (1987) గా రచించింది.[1][8]