ఎస్.ఆర్.జానకీరామన్ | |
---|---|
![]() | |
జననం | ఎస్.రంగసామి జానకీరామన్ 1928 జూలై 12 లాల్గుడి, తమిళనాడు |
వృత్తి | కర్ణాటక గాత్ర విద్వాంసుడు |
తల్లిదండ్రులు | రంగసామి అయ్యర్, గౌరీ అమ్మాళ్ |
ఎస్.ఆర్.జానకీరామన్ (జననం 12 జూలై 1928) ఒక కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసుడు, సంగీతజ్ఞుడు.[1]
ఎస్.ఆర్.జానకీరామన్ 1928, జూలై 12న తమిళనాడు రాష్ట్రం, తిరుచిరాపల్లి జిల్లా లాల్గుడి పట్టణంలో జన్మించాడు. ఇతడు టైగర్ వరదాచారి,బడలూర్ కృష్ణమూర్తిశాస్త్రి, టి.కె.రామస్వామి అయ్యంగార్, ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్, తిరుపంబరం స్వామినాథపిళ్ళై,మాయవరం వి.వి.కృష్ణ అయ్యర్, టి.బృంద వంటి మహామహుల వద్ద గాత్ర సంగీతం నేర్చుకున్నాడు. కల్పకం స్వామినాథన్ వద్ద వీణావాయిద్యం నేర్చుకున్నాడు. మద్రాసు కేంద్ర కర్ణాటక సంగీత కళాశాల నుండి సంగీత విద్వాన్ పట్టా పుచ్చుకున్నాడు. ఇతడు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, అన్నామలై విశ్వవిద్యాలయం,పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, శ్రీ షణ్ముఖానంద సంగీత సభ(ముంబై), ఇండియన్ మ్యూజికాలజికల్ సొసైటీ(బరోడా),ఆంధ్ర విశ్వవిద్యాలయం, నాగార్జున విశ్వవిద్యాలయం వంటి అనేక సంస్థలలో ఐదు దశాబ్దాల పాటు సంగీతశాస్త్రాన్ని బోధించాడు.ఇతడు అనేక గ్రంథాలు రచించాడు. తెలుగులో సంగీత శాస్త్ర సారము (రెండు భాగాలు) తమిళంలో రాగలక్షణాలు (మూడు భాగాలు), ఆంగ్లంలో రాగాస్ ఆఫ్ సారామృత,రాగాస్ అట్ ఎ గ్లాన్స్,ఎసెన్షియల్స్ ఆఫ్ మ్యూజికాలజీ, మిసిలనీ ఆఫ్ ఎస్సేస్ ఆన్ సౌత్ ఇండియన్ మ్యూజిక్ అండ్ మ్యూజికాలజీ మొదలైనవి ఇతడు రచించిన గ్రంథాలలో కొన్ని.ఇతడు ఎన్నో సెమినార్లలో సంగీతానికి సంబంధించిన పరిశోధనాపత్రాలు సమర్పించాడు. మహావైద్యనాథ అయ్యర్ కూర్చిన 72 మేళ రాగమాలిక ఆధారంగా 72 మేళకర్త రాగాలపై "వర్ణాస్ త్రూ ద ఏజెస్" అనే మూడు గంటల డాక్యుమెంటరీని తయారు చేశాడు.
ఇతనికి పలు సంస్థల నుండి అవార్డులు, గౌరవాలు దక్కాయి. మద్రాసు సంగీత అకాడమీ "సంగీత కళాచార్య" బిరుదును ప్రదానం చేసింది. 1998లో "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్" ఇతడిని కళైమామణి అవార్డుతో సత్కరించింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ 2000వ సంవత్సరంలో కర్ణాటక సంగీతం గాత్రం విభాగంలో అవార్డును ఇచ్చింది. భారత ప్రభుత్వం 2011లో పద్మశ్రీ పురస్కారంతో సన్మానించింది.[2] కేంద్ర సంగీత నాటక అకాడమీ సంగీత రంగంలో ఇతని కృషికి గుర్తింపుగా ఫెలోషిప్‌ను ఇచ్చింది.