చన్నపట్న బొమ్మలు | |
---|---|
![]() చన్నపట్న బొమ్మలు | |
వివరణ | చన్నపట్న బొమ్మలు అనేవి కొయ్య బొమ్మల్లో ఒక ప్రత్యేక రకం. |
రకం | హస్తకళ |
ప్రాంతం | కర్ణాటక లోని చన్నపట్న |
దేశం | భారతదేశం |
నమోదైంది | 2009 |
చన్నపట్న బొమ్మలు (Channapatna toys) అనేవి కొయ్య బొమ్మల్లో ఒక ప్రత్యేక రకం, వీటిని కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు గ్రామీణ జిల్లాలోని చన్నపట్న అనే పట్టణంలో తయారుచేస్తారు. ప్రపంచ వాణిజ్య సంస్థ ద్వారా ఈ సంప్రదాయ కళ భౌగోళిక గుర్తింపు పొంది పరిరక్షింపబడుతోంది, నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం బాధ్యత వహిస్తోంది.[1] ఈ బొమ్మల ప్రాచుర్యం కారణంగా చన్నపట్నానికి కర్ణాటక గొంబెగళ ఊరు (బొమ్మల-ఊరు) గా పేరుపొందింది.[2] సంప్రదాయికంగా, ఈ పనిలో రైటియా టింక్టోరియా చెట్టు నుంచి లభించే చెక్కను లక్క ఉపయోగించి చేసే పనివుంటుంది, [3] వ్యావహారికంగా ఆ చెక్కను ఆలె మర (దంతపు చెక్క) గా పిలుస్తారు.[4]
ఈ బొమ్మల పని ఆరంభం టిప్పు సుల్తాన్ హయాంలో కనిపిస్తుంది, టిప్పు ఈ పనిలో నిపుణుల్ని పర్షియా నుంచి ఆహ్వానించి స్థానిక నిపుణులకు కొయ్య బొమ్మల తయారీలో శిక్షణ ఇప్పించారు. స్కూల్ బవాస్ మియాన్ ని చన్నపట్న బొమ్మల పితామహునిగా భావిస్తారు. ఆయన చన్నపట్న బొమ్మల కోసం జీవితాన్ని ధారపోసిన వ్యక్తి. బొమ్మల తయారీకి జపనీస్ టెక్నాలజీని అందిపుచ్చుకుని తద్వారా స్థానిక నిపుణుల కళను అభివృద్ధి చేసేలా కృషిచేశారు.[2] 2 శతాబ్దాల పాటు, దంతపు చెక్క ఈ బొమ్మల తయారీకి ప్రధానమైన చెక్కగా నిలిచింది, అయినా గంధపు చెక్క, రోజ్ వుడ్ కూడా అడపాదడపా ఉపయోగించేవారు.
కాలక్రమేణా ఈ కళ బహుముఖీనమైంది; సంప్రదాయికమైన దంతపు చెక్కతో పాటు రబ్బర్, సైకమోర్, సెడర్, పైన్, టేకు వంటి ఇతర ఇతర రకాల కలప కూడా ప్రస్తుతం వాడుతున్నారు.[5] కలప సేకరించడం, చెక్కను నచ్చిన ఆకారాల్లోకి కొయ్యడం, బొమ్మలు చెక్కడం, రంగులు వేయడం, చివరికి తయారైన బొమ్మను మెరుగుచేయడం వంటి దశలు తయారీలో ఉంటాయి. ఉపయోగించే పిల్లల భద్రత కోసం బొమ్మలకు రంగులు వేసే క్రమంలో సహజ రంగులను ఉపయోగిస్తారు.[2] 2006 అక్టోబరు నాటికల్లా, 254 కుటీర పరిశ్రమలు, 50 చిన్న ఫ్యాక్టరీలు,6000 మందికి పైగా పనివారు, ఈ బొమ్మల తయారీలో ఉన్నారు. కర్ణాటక హస్తకళల అభివృద్ధి సంస్థ (కె.హెచ్.డి.సి.) మార్కెటింగ్ లో సహకారం అందిస్తోంది. అత్యంత ప్రాచీనమూ, ప్రాచుర్యం కలదీ అయిన తయారీ కేంద్రం భారత్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, కొత్తరకం బొమ్మల తయారీలో సహకారం అందిస్తోంది.[2]