గణేశ్ వాసుదేవ్ మావలాంకర్ | |||
జి.వి.మావళంకర్ | |||
1st లోక్‌సభ స్పీకరు
| |||
పదవీ కాలం 1952 మే 12 – 1956 ఫిబ్రవరి 27 | |||
ముందు | లేరు | ||
---|---|---|---|
తరువాత | ఎం.ఎ.అయ్యంగార్ | ||
నియోజకవర్గం | అహమ్మదాబాదు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1888 నవంబరు 27, బరోడా | ||
మరణం | ఫిబ్రవరి 27, 1956 అహ్మదాబాదు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జాతీయ కాంగ్రెస్ | ||
మతం | హిందూ | ||
జూలై 5, 2009నాటికి |
గణేశ్ వాసుదేవ్ మావలాంకర్ లేదా గణేశ్ వసుదేవ్ మవళంకర్ (1888 నవంబరు 27- 1956 ఫిబ్రవరి 27) ప్రజాదరణ పేరు దాదాసాహెబ్, స్వాతంత్ర్య సమర యోధుడు. ఇతను కేంద్ర రాజ్యాంగ సభ అధ్యక్షుడిగా 1946 నుండి 1947 వరకు ఉన్నాడు. స్వతంత్ర భారత లోక్‌సభ మొదటి స్పీకరు. ఇతడి కుమారుడు పురుషోత్తమ మావలాంకర్ ఆ తరువాత లోక్‌సభ సభ్యుడిగా గుజరాత్ నుండి ఎన్నికయ్యాడు.
దాదాసాహెబ్ గా ప్రసిద్ధి చెందిన గణేష్ వాసుదేవ్ మావలంకర్ 1888 నవంబరు 27 న బరోడా (ప్రస్తుతం వడోదర) లో జన్మించాడు. అహ్మదాబాద్ లోని గుజరాత్ కళాశాల నుంచి బ్యాచిలర్ పట్టా పొందాడు. 1912లో న్యాయశాస్త్రంలో పట్టా పొందాడు. మావలంకర్ పేరొందిన న్యాయవాది, చురుకైన సామాజిక కార్యకర్త. 1946 జనవరిలో ఆరవ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అధ్యక్ష పదవికి కాంగ్రెస్ పార్టీ ఆయనను ఎంపిక చేసింది.
గుజరాత్ స్వాతంత్ర్యోద్యమంలో మావలంకర్ చురుకైన పాత్ర పోషించాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్, మహాత్మాగాంధీ వంటి జాతీయ నాయకులతో పాటు గుజరాత్ లోని వివిధ సామాజిక సంస్థలతోనూ ఆయన అనుబంధం కలిగి ఉన్నాడు. మహాత్మాగాంధీ నాయకత్వంలో సహాయ నిరాకరణోద్యమంలో చేరిన తరువాత మావలంకర్ భారత జాతీయ కాంగ్రెస్ తో అనుబంధం ఏర్పడింది. ఉద్యమానికి ఆయన చేసిన కృషి కారణంగా 1921-22లో గుజరాత్ ప్రావిన్షియల్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యాడు .'ఖైరా నో రెంట్' ప్రచారంలో మావలంకర్ కీలక, క్రియాశీలక పాత్ర, కరవు, వరద సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొన్నాడు [1].
మావలంకర్ భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడయ్యాడు, స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొన్నాడు. ఈ కార్యకలాపాలకు గాను మావలంకర్ కు 6 సంవత్సరాల జైలు శిక్ష కూడా పడింది. 1921-22లో గుజరాత్ ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా పనిచేశాడు. అతను ఖేడా ఉద్యమంలో పాల్గొన్నాడు. 1919 నుండి 1937 వరకు అహ్మదాబాద్ మునిసిపాలిటీలో సభ్యుడిగా, 1930-33 లో, తరువాత 1935-36 మునిసిపాలిటీ అధ్యక్షుడయ్యాడు. మావలంకర్ సామాజిక సేవ, రాజకీయాలతో పాటు విద్యారంగంలో కొంతకాలం న్యాయశాస్త్ర ప్రొఫెసర్ గా పనిచేయడం జరిగింది. అహ్మదాబాద్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపకుడిగా, అధ్యక్షుడిగా, గుజరాత్ వెర్నాక్యులర్ సొసైటీకి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. గుజరాత్ విశ్వవిద్యాలయం కోసం వనరులను సమీకరించడానికి కృషి చేయడం జరిగింది. 1937లో అహ్మదాబాద్ నుంచి బొంబాయి లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నిక, తన తొలి శాసనసభ పదవీకాలంలోనే ఆయనను అసెంబ్లీ స్పీకర్ గా నియమించాడు. అతను 1946 వరకు స్పీకర్ గా కొనసాగాడు. 1946లో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నికయ్యాడు. 1947 ఆగస్టు 15న సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీని రద్దు చేసి రాజ్యాంగ పరిషత్తు ఏర్పడే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగాడు. 1947 నవంబరు 17 న మావలంకర్ తిరిగి రాజ్యాంగ సభ (లెజిస్లేటివ్) స్పీకర్ గా నియమించబడ్డాడు. 1949 నవంబరు 26న ఏర్పడిన తాత్కాలిక పార్లమెంటుకు స్పీకర్ గా నియమితులయ్యాడు. తొలి లోక్ సభ 1952లో ఏర్పడింది. 1950 జనవరి 26 న రాజ్యాంగం అమలు చేసిన తరువాత, రాజ్యాంగ సభ తాత్కాలిక పార్లమెంటుగా మార్చబడింది. 1951-52 ఎన్నికల తర్వాత కొత్త లోక్ సభ ఏర్పడింది. స్పీకర్ పదవికి జరిగిన మొదటి ఎన్నికల్లో ఎస్.ఎస్.మోరేకు వ్యతిరేకంగా జి.వి.మావలంకర్ గెలుపొందాడు.[2]
మావలంకర్ స్పీకరుగా సభా నియమాలకు అనేక నూతన ఆవిష్కరణలు చేశాడు, అందులో 'ప్రశ్నోత్తరాల సమయం' సమావేశాలు పార్లమెంటులో క్రమం తప్పకుండా, ముఖ్యమైన అంశంగా ఉండటానికి ఆయనే ప్రధాన కారణం. రాష్ట్రపతి ప్రసంగం, ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను మళ్లీ మావలంకర్ ప్రారంభించాడు. రూల్స్ కమిటీ, బిజినెస్ అడ్వైజరీ కమిటీ, ప్రివిలేజెస్ కమిటీ, సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ, ప్రైవేట్ మెంబర్ బిల్లులు, తీర్మానాల కమిటీ, సభా సమావేశాలకు సభ్యుల గైర్హాజరుపై కమిటీ, ప్రభుత్వ హామీల కమిటీ, పార్లమెంటు సభ్యుల జీతభత్యాలపై జాయింట్ కమిటీ వంటి కమిటీలను ప్రారంభించేందుకు ఆయన చొరవ తీసుకున్నాడు. మావలంకర్ సభ ప్రక్రియ, నిర్వహణ కోసం అనేక నియమాలను రూపొందించాడు, అవి ఈ రోజు వరకు అనుసరించబడుతున్నాయి[3]. లోక్‌సభ స్పీకర్ (సభాపతి) పదవిలో కొనసాగుతూ ఉంటూనే 1956 ఫిబ్రవరి 27న మావలంకర్ మరణించాడు[4].