జె.ఎమ్. లింగ్‌డో | |
---|---|
భారత ప్రధాన ఎన్నికల కమిషనరు | |
In office 2001 జూన్ 14 – 2004 ఫిబ్రవరి 7 | |
అంతకు ముందు వారు | ఎమ్.ఎస్. గిల్ |
తరువాత వారు | టి.ఎస్. కృష్ణమూర్తి |
వ్యక్తిగత వివరాలు | |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | ప్రభుత్వ ఉద్యోగి |
పురస్కారాలు | రామన్ మెగసెసే పురస్కారం 2003 ప్రభుత్వ ఉద్యోగం |
జె.ఎం.లింగ్డో 2001 జూన్ 14 నుండి 2004 ఫిబ్రవరి 7 వరకు భారత ప్రధాన ఎన్నికల కమిషనరు పదవిని నిర్వహించాడు. 2003 లో ప్రభుత్వ ఉద్యోగిగా ఆయనకు రామోన్ మెగ్సేసే పురస్కారం లభించింది.
లింగ్డో మేఘాలయ లోని ఖాసి తెగకు చెందినవాడు. జిల్లా జడ్జి కుమారుడాయన. షిల్లాంగ్ లోని సెంట్ ఎడ్మండ్ పాఠశాలలో చదివాడు. ఢిల్లీ లోని సెంట్ స్టీఫెన్స్ కళాశాలలో చదువు పూర్తి చేసాడు.
ఇరవైరెండేళ్ళ వయసులో లింగ్డో ఐ.ఏ.ఎస్ ఉద్యోగం చేపట్టాడు. త్వరలోనే నీతి, నిజాయితీ కలిగిన అధికారిగా పేరు తెచ్చుకున్నాడు. ధనిక వర్గాలకు, రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా, పేదలకు అండగా నిలబడ్డాడు. వృత్తి జీవితంలో అంచెలంచెలుగా ఎదిగి భారత ప్రభుత్వ క్యాబినెట్ సెక్రెటేరియట్‌లో కో-ఆర్డినేషన్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ శాఖలో సెక్రెటరీగా పనిచేసాడు.
1997 లో ఆయన ఎన్నికల కమిషనరుగా నియమితుడయ్యాడు. 2001 లో ఎం.ఎస్. గిల్ తరువాత, ప్రధాన ఎన్నికల కమిషనరుగా బాధ్యతలు స్వీకరించాడు. తన హయాంలో రెండు రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా సవాళ్ళు ఎదుర్కొన్నాడు. ఒకటి జమ్మూ కాశ్మీరు కాగా రెండోది గుజరాత్.
2002 జూలైలో, గుజరాత్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ సిఫారసు మీద, పదవీకాలం కంటే 9 నెలల ముందుగా గవర్నరు రద్దు చేసాడు. శాసన సభ సమావేశాల మధ్య ఆరు నెలలకు మించి వ్యవధి ఉండరాదు కాబట్టి, ముందే ఎన్నికలు పెట్టేలా ఎన్నికల కమిషన్ను బలవంతం చేసేందుకు చేసిన చర్య అని ప్రతిపక్షాలు ఆరోపించాయి.[1] అప్పటికి కొద్దికాలం కిందటే రాష్ట్రంలో జరిగిన మతకల్లోలాల నేపథ్యంలో శాసనసభ రద్దును ఎన్నికల కమిషను బహిరంగంగానే వ్యతిరేకించింది..[1].[2] లింగ్డో సారథ్యంలోని ఎన్నికల కమిషను రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నిర్వహణకు అంగీకరించలేదు.[3] 2002 ఆగస్టు 20 న, వదోదర వద్ద జరిగిన బహిరంగ సభలో నరేంద్ర మోదీ, ముందస్తు ఎన్నికలు జరపకపోవడానికి కారణం లింగ్డో క్రైస్తవుడు కావడమేనని ఆరోపించాడు. బహిరంగ సభల్లోను, పత్రికా సమావేశాల్లోనూ మోదీ ఆయన్ను జేమ్స్ మైకెల్ లింగ్డో అని పూర్తి పేరుతో సంబోధించేవాడు. ఇదంతా, నాస్తికత్వం అంటే తెలియని చవకబారు మనుష్యులు చేసే ప్రచారమని, అది ఖండనీయమైనదనీ లింగ్డో ప్రతివిమర్శ చేసాడు.[4][5][6] ప్రధాని వాజపేయి మోదీని మందలించాక, ఆ వివాదం ముగిసిందని మోదీ ప్రకటించాడు. కానీ ముందస్తు ఎన్నికలపై తన డిమాండును పునరుద్ఘాటించాడు.[7] 2002 ఆక్టోబరులో గుజరాత్ శాసనసభ ఎన్నికలు వాయిదా వెయ్యడాన్ని భారత సుప్రీమ్ కోర్టు సమర్ధించింది.[8][9]
2004 లో లింగ్డో "క్రానికిల్స్ ఆఫ్ ఎన్ ఇంపాసిబుల్ ఎలెక్షన్[10]" అనే పుస్తకాన్ని ప్రచురించాడు. భారతదేశంలో ఎన్నికల విధానం గురించి, ఎన్నికల కమిషను పాత్ర గురించీ అందులో రాసాడు. 2002 లో జరిగిన జమ్మూ కాశ్మీరు శాసనసభ ఎన్నికలపై ఆయన కథనం అది. 2002 నాటి గుజరాత్ ఎన్నికల గురించి కూడా అందులో చర్చించాడు. ఆ పుస్తకం విమర్శకుల ప్రశంస లందుకుంది.[11][12][13][14]
రాజకీయాలు, రాజకీయ నాయకుల పట్ల తనకున్న ఏహ్యభావాన్ని తరచూ బయటపెట్టేవాడు. 2004 ఫిబ్రవరిలో "నా ఇంటికి ఎవరైనా రావచ్చు, రాజకీయ నాయకులు మాత్రం ముందస్తు అనుమతి తీసుకున్న తరువాత మాత్రమే రావాలి" అని అన్నాడు.[15] 2002 ఆగస్టులో "నేటివి మురికి రాజకీయాలు, విషపూరితమైనవి, పక్షపాత యుతమైనవి" అని అన్నాడు.[16]
2003 డిసెంబరులో బీబీసీ కోసం కరణ్ థాపర్ చేసిన ఇంటర్వ్యూలో లింగ్డో "రాజకీయ నాయకులు కాన్సరు వంటి వారు" అని అన్నాడు.[17] ఈ వ్యాఖ్య బహు చర్చితమైంది.
2004 లో పదవీ విరమణ తరువాత లింగ్డో రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం ప్రొద్దటూర్ లో స్థిరపడ్డాడు. పదవిలో ఉన్న అధికారులు, విశ్రాంత అధికారులూ కలసి చేపట్టిన భారత పునరుజ్జీవనం అనే అవినీతి వ్యతిరేక సంస్థలో చురుగ్గా పాల్గొంటాడు.[18]