తెలంగాణ | |
---|---|
![]() తెలంగాణ ప్రదేశాలు (పై నుండి): చార్మినారు, వరంగల్ కోట, హైదరాబాదు నగరం, నిజామాబాదు రైల్వే స్టేషను, కుంటాల జలపాతం,ఫలక్‌నుమా ప్యాలెస్ |
ఎత్తైన దక్కన్ పీఠభూమిలో ఉన్న తెలంగాణ, చరిత్రలో శాతవాహన (230 BCE నుండి 220 CE వరకు), కాకతీయ (1083-1323), ముసునూరి నాయకుల (1326-1356), ఢిల్లీ సుల్తానేట్ బహమనీ సుల్తానేట్ (1347-1512), గోల్కొండ సుల్తానేట్ (1512-1687), అసఫ్ జాహీ రాజవంశం (1724-1950) మొదలైన రాజవంశీయుల పాలనలో ఉంది.[1]
1724లో ముబారిజ్ ఖాన్‌ను ఓడించిన నిజాం-ఉల్-ముల్క్, హైదరాబాద్‌ను స్వాధీనం చేసుకున్నాడు. ఆ తరువాత అతని వారసులు హైదరాబాదు నిజాములుగా చాలాకాలంపాటు హైదరాబాద్ సంస్థానాన్ని పాలించారు. నిజాం రాజులు తెలంగాణలో మొదటి రైల్వేలు, పోస్టల్, టెలిగ్రాఫ్ నెట్‌వర్క్‌లు, మొదటి విశ్వవిద్యాలయాలను స్థాపించారు.
భారత స్వాతంత్ర్యం తరువాత, హైదరాబాదు రాఫ్ట్రం భారతదేశంలో కలవడానికి విలీన పత్రంపై నిజాంరాజు సంతకం చేయలేదు. 1948లో భారత సైన్యం హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆక్రమించుకోవడంతో విలీనం కాక తప్పలేదు. 2014 జూన్ 2న, హైదరాబాద్ రాజధానిగా భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అవతరించింది.[2] హైదరాబాద్ నగరం పదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుంది.[3]
పురాతన రాతియుగం నుంచే తెలంగాణ ప్రాంతం ఉనికిని కలిగియుంది. పూర్వ రాతియుగం కాలం నాటి ఆవాసస్థలాలు వేములపల్లి, ఏటూరునాగారం, బాసర, బోథ్, హాలియా, క్యాతూర్ తదితర ప్రాంతాలలో బయటపడ్డాయి. వాడపల్లి, వెల్టూరు, పోచంపాడు, ఎల్లారెడ్డిపేట తదితర ప్రాంతాలలో బృహశ్శిలాయుగం నాటి ఆనవాళ్ళను పురావస్తు శాస్త్రవేత్తలు సేకరించారు.[4] షోడశ మహాజనపదాల కాలంలో దక్షిణాదిలోని ఏకైక జనపదం అశ్మక జనపదం ఈ ప్రాంతంలోనిదే. పోదన్ (నేటి బోధన్) దీని రాజధానిగా ఉండింది. బౌద్ధ గ్రంథాలలో కూడా ఈ సమాచారం నిక్షిప్తమైయుంది. బుద్ధుడి కాలంలో సుజాతుడు బోధన్ పాలకుడిగా ఉన్నట్లు బౌద్ధ వాజ్ఞయం తెలియజేస్తుంది. బుద్ధి సమకాలికుడు బావరి స్థిరపడ్డ ప్రాంతం నేడు బావనకుర్తి (ఆదిలాబాదు జిల్లాలో నదీద్వీపం) గా పిలుబడుతున్నది. మత్స్యపురాణంలో మంజీరక దేశం (నేటి మంజీరా నది పరీవాహప్రాంతం) ప్రస్తావన కూడా ఉంది.[5] ప్రతిష్ఠానపురం (పైఠాన్) రాజధానిగా పాలించిన ములక రాజ్యం గోదావరి నది సరిహద్దు వరకు ఉండగా అందులో నేటి ఆదిలాబాదు జిల్లా ప్రాంతం భాగంగా ఉండింది. అప్పుడు ఉత్తర-దక్షిణ ప్రధానమార్గం ఈ రాజ్యం గుండా ఉండేది.[6] విదేశాలలో ఉండే బౌద్ధులు దీనిని మంజీరకమని పిలిచారు (నేటి మంజీరా నది పరీవాహక ప్రాంతం).[7] షోడశ మహాజనపదాలలో మగధ రాజ్యం బలపడి చాలా రాజ్యాల్ని ఆక్రమించగా అప్పుడు అశ్మక రాజ్యం కూడా మగధలో విలీనమైంది. ఆ తర్వాత నందరాజులు, ఆ పిదప మౌర్యులు ఈ ప్రాంతాన్ని పాలించారు.
మౌర్యుల కాలంలో ఈ ప్రాంతం భాగంగా ఉండేదనడానికి అశోకుని 13వ శిలాశాసనం ఆధారంగా చరిత్రకారులు నిర్ణయించారు. మౌర్యుల కాలంలో పర్యటించిన విదేశీ యాత్రికుడు మెగస్తనీసు ఆంధ్రులకు 30 దుర్గాలున్నాయని పేర్కొనగా అందులో కదంబపూర్ (కరీంనగర్), పౌదన్యపురం (బోధన్), పిధుండ, ముషిక, ధూళికట్ట, పెద్దబొంకూర్, ఫణిగిరి, కొండాపురం, కోటిలింగాల, గాజులబండ ముఖ్యమైనది.[8] ఇవన్నీ నేటి తెలంగాణ రాష్ట్రంలోనివే. ఇంకనూ బయటపడాల్సిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి.[9] మెగస్తనీసు ఎంతో బలవంతమైనదిగా వర్ణించిన ఆంధ్రరాజ్యం బహుశా ములక అస్సక లేదా ప్రతిష్ఠాన రాజ్యమే అయి ఉంటుందని చరిత్రకారుడు బి.ఎస్.ఎల్.హనుమంతరావు పేర్కొన్నారు.[10]
మౌర్య సామ్రాజ్యం పతనమైన తరువాత శాతవాహనులు రాజకీయ శక్తిగా ఎదిగారు. కోటి లింగాల ప్రాంతం శాతవాహన రాజవంశపు 30 నగరాలలో ఒకటిగా ఉంది.[11] ఆ ప్రాంతాలలో జరిపిన త్రవ్వకాలలో ఇటుక బావులు, శాతవాహనుల పూర్వ కాలానికి చెందిన గోభడ, సామగోప నాణేలు బయటపడ్డాయి. ఈ ప్రదేశం భవారీ మహర్షి ఆశ్రయం(నిర్మల్ జిల్లాలోని బాధనకుర్తి గ్రామం దివి ప్రసిద్ధ బౌద్ధ మత ప్రచారాన్ని బావరి మహర్షి చేసిన గ్రామం) ఉన్న ప్రదేశంగా పేరొందింది.[12] శాతవాహన రాజవంశ స్థాపకుడు సిముఖకు చెందిన అనేక నాణేలు, కన్హా, శాతకర్ణి I వంటి ఇతర ప్రారంభ పాలకుల నాణేలు కూడా ఈ తవ్వకాలలో కనుగొనబడ్డాయి.[13]
బాదామి చాళుక్యులు
బాదామి చాళుక్యుల కాలంలో తెలంగాణ మొత్తం వీరి పాలనలోఉండేది.ఆంధ్రదేశ చరిత్ర-సంస్కృతి-మొదటి భాగం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన ఆలంపూర్ ఆలయాలు ఈ కాలంలోనే నిర్మించబడ్డాయి. ఆలంపూర్‌లో పలు సంఖ్యలో వీరి రాతిశాసనాలు ఉన్నాయి.తెలంగాణ శాసనాలు, మొదటి భాగంహశ్శిలాయుగం నాటి ఆనవాళ్ళను పురావస్తు శాస్త్రవేత్తలు సేకరించారు.షోడశ మహాజనపదాల కాలంలో దక్షిణాదిలోని ఏకైక జనపదం అశ్మక జనపదం ఈ ప్రాంతంలోనిదే. పోదన్ (నేటి బోధన్) దీని రాజధానిగా ఉండింది. బౌద్ధ గ్రంథాలలో కూడా ఈ సమాచారం నిక్షిప్తమైయుంది. బుద్ధుడి కాలంలో సుజాతుడు బోధన్ పాలకుడిగా ఉన్నట్లు బౌద్ధ వాజ్ఞయం తెలియజేస్తుంది. బుద్ధి సమకాలికుడు బావరి స్థిరపడ్డ ప్రాంతం నేడు బావనకుర్తి (ఆదిలాబాదు జిల్లాలో నదీద్వీపం) గా పిలుబడుతున్నది. మత్స్యపురాణంలో మంజీరక దేశం (నేటి మంజీరా నది పరీవాహప్రాంతం) ప్రస్తావన కూడా ఉంది.[5] ప్రతిష్ఠానపురం (పైఠాన్) రాజధానిగా పాలించిన ములక రాజ్యం గోదావరి నది సరిహద్దు వరకు ఉండగా అందులో నేటి ఆదిలాబాదు జిల్లా ప్రాంతం భాగంగా ఉండింది. అప్పుడు ఉత్తర-దక్షిణ ప్రధానమార్గం ఈ రాజ్యం గుండా ఉండేది.[6] విదేశాలలో ఉండే బౌద్ధులు దీనిని మంజీరకమని పిలిచారు (నేటి మంజీరా నది పరీవాహక ప్రాంతం).[5] షోడశ మహాజనపదాలలో మగధ రాజ్యం బలపడి చాలా రాజ్యాల్ని ఆక్రమించగా అప్పుడు అశ్మక రాజ్యం కూడా మగధలో విలీనమైంది. ఆ తర్వాత నందరాజులు, ఆ పిదప మౌర్యులు ఈ ప్రాంతాన్ని పాలించారు.
రాష్ట్రకూటులు
రెండో కీర్తివర్మతో చాళుక్యవంశం అంతంకాగా మాన్యఖేతం రాజధానిగా రాష్ట్రకూటులు పాలన సాగించారు. దంతిదుర్గుని కాలంలో తెలంగాణ మొత్తం రాష్ట్రకూటుల పాలనలో ఉండేది. తెలంగాణలో తొలి గద్యశాసనం "కొరివి శాసనం" ఈ కాలం నాటిదే. రాష్ట్రకూటుల సామంతులుగా ఉన్న వేములవాడ చాళుక్యులు బోధన్, వేములవాడలలో స్వతంత్ర పాలన చేశారు.
కళ్యాణి చాళుక్యులు
రాష్ట్రకూట రాజు రెండోకర్కరాజును ఓడించి రెండో తైలపుడు కళ్యాణి చాళుక్యరాజ్యం స్థాపించాడు. కవి రన్నడు ఇతని ఆస్థాన కవి.[14] మహబూబ్‌నగర్ జిల్లా గంగాపురంలోని చెన్నకేశ్వస్వామి ఆలయాన్ని ఈ కాలంలోనే నిర్మించబడింది. ఈ ప్రాంతంలోవీరి పలు శాసనాలున్నాయి. ఇదే కాలంలో ఖమ్మం ప్రాంతంలో ముదిగొండ చాళుక్యులు పాలించారు. పాలమూరు జిల్లా మద్యభాగంలో కందూరి చోడుల పాలన కిందకు ఉండేది.
కందూరి చోడులు
క్రమక్రమంగా కందూరు చోళరాజ్యం విస్తరించింది. తొలి కాకతీయుల కాలం నాటికి ఇది కాకతీయ రాజ్యం కంటే పెద్ద రాజ్యంగా విలసిల్లింది.[15] కందూరు, మగతల (నేటి మక్తల్), వర్థమానపురం (నేటి నంది వడ్డెమాన్), గంగాపురం, అమరాబాద్, భువనగిరి, వాడపల్లి, కొలనుపాక ఈ కాలంలో పెద్ద పట్టణాలుగా విలసిల్లాయి. విక్రమాదియుని కుమారుడు తైలపుని కాలంలో రాజ్యాన్ని రెండుగా చేసి ఇద్దరు కుమారులను రాజులుగా చేశాడు. దానితో ఇప్పటి నల్గొండ, పాలమూరు జిల్లా ప్రాంతాలలోవేర్వేరు పాలన సాగింది. గోకర్ణుడు తన రాజధానిని పానగల్లు నుంచి వర్థమాన పురానికి తరలించాడు. కందూరు చోడుల శాసనం ఒకటి మామిళ్ళపల్లిలో కూడా లభ్యమైంది. ఇదే కాలంలో వరంగల్ ప్రాంతంలో పొలవాస పాలకులు రాజ్యం చేశారు. అనుమకొండ (నేటి హన్మకొండ ప్రాంతం) మాత్రం కొలనుపాక రాజధానిగా కళ్యాణి చాళుక్యులే పాలించారు.
12వ, 13వ శతాబ్దాలలో కాకతీయ రాజవంశం వచ్చింది.[16] వరంగల్ కోట, రామప్ప దేవాలయం, వేయి స్తంభాల గుడి, కోట గుళ్ళు వంటి ప్రసిద్ధ శిల్పకళకు ఈ కాకతీయులు ప్రసిద్ధి చెందారు.[17][18]
మొదట్లో కాకతీయులు కల్యాణి పశ్చిమ చాళుక్యుల సామంతులు, వరంగల్ సమీపంలోని ఒక చిన్న భూభాగాన్ని పాలించారు. ఈ రాజవంశానికి చెందిన పాలకుడు, ప్రోలా II (1110–1158), దక్షిణాన తన అధికారాన్ని విస్తరింపజేసి, స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నాడు. ప్రోలా II వారసుడు రుద్రుడు (1158-1195) తూర్పున గోదావరి డెల్టా వరకు రాజ్యాన్ని విస్తరించాడు. ఆ రాజ్యానికి రెండవ రాజధానిగా వరంగల్ కోటను నిర్మించడంతోపాటు, దేవగిరిపై సేన యాదవుల దండయాత్రలను ఎదుర్కొన్నాడు. ఆ తరువాత, మహాదేవుడు రాజ్యాన్ని తీర ప్రాంతానికి విస్తరించాడు. అతని తర్వాత 1199లో గణపతిదేవుడు వచ్చాడు. అతను కాకతీయులలో గొప్పవాడిగా, శాతవాహనుల తర్వాత దాదాపు మొత్తం తెలుగు ప్రాంతాన్ని ఒక ఏకీకృత సామ్రాజ్యం క్రిందకు తీసుకువచ్చిన మొదటివాడిగా నిలిచాడు. 1210లో గణపతిదేవుడు వెలనాటి చోళుల పాలనకు ముగింపు పలికి ఉత్తరాన అనకాపల్లి వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు.
ఈ రాజవంశంలో గొప్పగా కీర్తించబడిన రాణి రుద్రమ దేవి (1262–1289), భారతచరిత్రలోని కొద్దిమంది రాణులలో ఒకరు. రుద్రమ చోళులు, సేన యాదవులకు వ్యతిరేకంగా రాజ్యాన్ని రక్షించడంతోపాటు వారి గౌరవాన్ని కూడా సంపాదించాడు. మార్కో పోలో అనే చరిత్రకారుడు రుద్రమదేవి కాలంలో భారతదేశాన్ని సందర్శించి, ఆమె పాలన గురించి తన పుస్తకాలలో గొప్పగా రాశాడు.[19]
1290 ప్రారంభంలో రుద్రమదేవి మరణించిన తరువాత, రుద్రమ మనవడు రెండవ ప్రతాపరుద్రుడు కాకతీయ సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్టించాడు. ప్రతాపరుద్రుడు పశ్చిమాన రాయచూరుకు, దక్షిణాన ఒంగోలు, నల్లమల కొండల వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు. తన రాజ్యంలో అనేక పరిపాలనా సంస్కరణలను ప్రవేశపెట్టాడు, వాటిలో కొన్ని ఆ తరువాతి విజయనగర సామ్రాజ్యంలో కూడా ప్రవేశపెట్టబడ్డాయి.
1309లో, ఢిల్లీ సుల్తాన్, అల్లావుద్దీన్ ఖిల్జీ తన సైన్యాధ్యక్షుడు మాలిక్ కాఫుర్‌లో తన సైన్యాన్ని కాకతీయ రాజ్యంపై దండయాత్రకు పంపాడు.[20] 1310, జనవరిలో సైన్యం కాకతీయ రాజధాని వరంగల్‌కు చేరుకొని, కోటను ముట్టడించింది.[21] నెల రోజుల తరువాత, ప్రతాపరుద్రుడు లొంగిపోవాలని నిర్ణయించుకొని, తన ఓటమిని అంగీకరించాడు. ఓడిపోయిన ప్రతాపరుద్రుడి భారీ మొత్తంలో సంపదను తీసుకొని 1310 జూన్ లో కాఫుర్ తన సైన్యంతో ఢిల్లీకి తిరిగి వెళ్ళాడు.
1323లో, ఘియాత్ అల్-దిన్ తుగ్లక్ తన కుమారుడు ముహమ్మద్ బిన్ తుగ్లక్ను కాకతీయ రాజధాని వరంగల్‌కు దండయాత్రకు పంపాడు. తుగ్లక్ దండయాత్రతో వరంగల్‌ను విలీనం చేయడంతోపాటు కాకతీయ రాజవంశం అంతం అయింది.[22] ప్రతాపరుద్రుడిని బందీగా చేసి, ఢిల్లీకి పంపించారు. (మార్గమధ్యంలో ప్రతాపరుద్రుడు మరణించాడని నమ్ముతారు). సింహాసనాన్ని అధిష్టించడానికి ఢిల్లీకి తిరిగి వెళ్ళేవరకు తుగ్లక్ కొంతకాలం వైస్రాయ్‌గా ఈ ప్రా్తాన్ని పాలించాడు.
కాకతీయ రాజ్యానికి సైన్యాధిపతులుగా పనిచేసిన ముసునూరి నాయకులు వివిధ తెలుగు వంశాలను ఏకంచేసి 1330లో ఢిల్లీ సుల్తానేట్ వైస్రాయ్ నుండి వరంగల్‌ను స్వాధీనం చేసుకుని అర్ధ శతాబ్దం పాటు తన పాలన సాగించారు. 15వ శతాబ్దం నాటికి కొన్ని కొత్త ప్రాంతాలు బహమనీ సుల్తానేట్, సంగమ రాజవంశానికి అప్పగించబడ్డాయి. వాటిల్లో చివరి ప్రాంతం తరువాతి కాలంలో విజయనగర సామ్రాజ్యంగా పరిణామం చెందింది.[23]
15వ శతాబ్దంలో ఈ ప్రాంతం బహమనీ సుల్తానేట్ల చేతుల్లోకి పోయింది. 1463లో రెండవ సుల్తాన్ ముహమ్మద్ షా బహమనీ తెలంగాణ ప్రాంతానికి సుల్తాన్ కులీ కుతుబ్-ఉల్-ముల్క్‌ను పంపి అక్కడి వారిని అణిచివేయమని చెప్పాడు. సుల్తాన్ కులీ గోల్కొండలోని కాకతీయ కొండ కోట వద్ద ఒక స్థావరాన్ని స్థాపించి, రాజ్యాన్ని విస్తరించాడు. శతాబ్దం చివరి నాటికి, కులీ తెలంగాణ ప్రాంతానికి సుబేదార్ (గవర్నర్) గా మారి గోల్కొండ నుండి రాజ్యాన్ని పాలించాడు. 1518లో, బహమనీ సుల్తానేట్ ఐదు వేర్వేరు రాజ్యాలుగా విడిపోయింది. మిగిలిన ప్రాంతాలు అహ్మద్‌నగర్, బేరార్, బీదర్, బీజాపూర్‌లో ఉన్నాయి. సుల్తాన్ కులీ బహమనీ పాలన నుండి స్వాతంత్ర్యం ప్రకటించి, "సుల్తాన్ కులీ కుతుబ్ షా" పేరుతో గోల్కొండ సుల్తానేట్‌ను స్థాపించాడు.[25][26] గోల్కొండ మట్టి-కోటను పునర్నిర్మించి, నగరానికి ముహమ్మద్ నగర్ అని పేరు పెట్టాడు.[27][28]
1591లో మూసీ నది తీరంలో మహమ్మద్ కులీ కుతుబ్ షా ఈ హైదరాబాద్ నగరాన్ని స్థాపించాడు.[29] నగరానికి కేంద్రంగా చార్మినార్, మక్కా మసీదు వంటివి నిర్మించబడ్డాయి. సంవత్సరాలు గడిచినకొద్దీ హైదరాబాదు నగరం వజ్రాలు, ముత్యాలు, ఆయుధాలు, ఉక్కుకు ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందంది.
కుతుబ్ షాహీ పాలకులు ఇండో-పర్షియన్, స్థానిక తెలుగువారి కళల-సంస్కృతి రెండింటికీ పోషకులుగా ఉన్నారు.[30] తొలిరోజుల్లో కుతుబ్ షాహీ నిర్మించిన గోల్కొండ కోట, కుతుబ్ షాహీ సమాధులు, చార్మినార్, మక్కా మసీదు, ఖైరతాబాద్ మసీదు, తారామతి బరాదరి, టోలి మసీదు మొదలైన భవనాలలో ఇండో-ఇస్లామిక్ నిర్మాణ శైలి ప్రతిబింబిస్తుంది.
మొఘల్ యువరాజు ఔరంగజేబ్ తన జీవితకాలంలో ఎక్కువసమయం దక్కన్ ప్రాంతంలోనే గడిపాడు. మొఘల్ సార్వభౌమత్వాన్ని స్థాపించడానికి స్థానిక హిందూ, ముస్లిం రాజ్యాలతో సమానంగా పోరాడాడు. గోల్కొండ సుల్తానేట్ తన తండ్రి, మొఘల్ చక్రవర్తి షాజహాన్ చేత దక్కన్ వైస్రాయ్‌గా నియమించబడిన మొఘల్ యువరాజు ఔరంగజేబు చేసిన అనేక దాడులను ఎదుర్కొన్నాడు.
1656లో, ఔరంగజేబు గోల్కొండ కోటపై దాడి చేశాడు. కానీ, షాజహాన్ ఆదేశాల మేరకు ముట్టడిని విరమించుకోవలసి వచ్చింది. దాంతో, అబ్దుల్లా కుతుబ్ షా-ఔరంగజేబుల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. వార్షిక పన్ను చెల్లించి, కుతుబ్ షా కుమార్తెను ఔరంగజేబు పెద్ద కుమారుడికిచ్చి వివాహం చేశారు.[31][32]
మొఘల్ చక్రవర్తి అయిన తర్వాత, ఔరంగజేబు దక్కన్‌కు తిరిగి వచ్చాడు. 1687లో హైదరాబాదును స్వాధీనం చేసుకుని గోల్కొండను ముట్టడించాడు.[33] తొమ్మిది నెలల సుదీర్ఘ ముట్టడి తర్వాత 1687, సెప్టెంబరు 22న గోల్కొండను స్వాధీనం చేసుకున్నాడు. అబుల్ హసన్ కుతుబ్ షా బందీ అయ్యాడు. ఆ సమయంలో హైదరాబాదు వజ్రాల వ్యాపారం అంతా నాశనమైంది.
అసఫ్ జాహీ రాజవంశం అని కూడా పిలువబడే హైదరాబాద్ నిజాంలు 1724 నుండి 1948 వరకు తెలంగాణ, మరాఠ్వాడా, కళ్యాణ-కర్ణాటకలను కలిగి ఉన్న హైదరాబాద్ రాష్ట్రాన్ని పాలించారు. ఆ కాలంలో హైదరాబాద్ రాష్ట్రం బ్రిటిష్ భారతదేశంలో అతిపెద్ద రాచరిక రాష్ట్రంగా ఉండడంతోపాటు స్వంత మింట్, కరెన్సీ, రైల్వే, పోస్టల్ వ్యవస్థను కలిగి ఉంది. వజ్రాల వ్యాపారం వల్ల నిజాం రాజు పెద్ద మొత్తంలో ధనాన్ని సంపాదించాడు.
1707లో ఔరంగజేబు మరణానంతరం మొఘల్ సామ్రాజ్యం పతనమవడంతో, దక్కన్ సుబా ( డెక్కన్ ప్రావిన్స్) మొఘల్ నియమించిన గవర్నర్లు ఢిల్లీ నుండి మరింత స్వయంప్రతిపత్తిని పొందారు. 1714లో, మొఘల్ చక్రవర్తి ఫరూఖ్సియార్ మీర్ కమర్-ఉద్-దిన్ సిద్ధిఖీని దక్కన్‌కు వైస్రాయ్‌గా నియమించాడు. అతనికి నిజాం-ఉల్-ముల్క్ (దేశ గవర్నర్) బిరుదును ఇచ్చాడు. హైదరాబాదు ముట్టడి సమయంలో కమాండర్లుగా ఉన్న తన తండ్రి, తాతలతో కలిసి పోరాడిన అతను ఆ పదవికి అర్హుడు.
1724లో ముబారిజ్ ఖాన్‌ను ఓడించి హైదరాబాద్‌పై నియంత్రణ సాధించాడు. ఆ తర్వాత సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి ముహమ్మద్ షా నుండి అసఫ్ జా బిరుదును అందుకున్నాడు. ఆ విధంగా 1948 వరకు హైదరాబాద్ రాష్ట్రాన్ని పాలించిన అసఫ్ జాహీ రాజవంశం ప్రారంభమైంది.
1748లో అసఫ్ జా I మరణించినప్పుడు, అతని కుమారుల మధ్య సింహాసనం కోసం వివాదం జరగడంతో రాజకీయ అశాంతి ఏర్పడింది, వీరికి అవకాశవాద పొరుగు రాష్ట్రాలు, వలసవాద విదేశీ శక్తులు సహాయం చేశాయి. చివరికి ఆసిఫ్ జా II సింహాసనం అధిష్టించి, 1762 నుండి 1803 వరకు పరిపాలించాడు. 1768లో అతను మచిలీపట్నం ఒడంబడికపై సంతకం చేశాడు, నిర్ణీత వార్షిక అద్దెకు బదులుగా తీరప్రాంతాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించాడు.[34]
1769లో హైదరాబాద్ నగరం నిజాంల అధికారిక రాజధానిగా మారింది.[35][36] హైదర్ అలీ (మైసూర్ దళ్వాయి), బాజీ రావ్ I (మరాఠా సామ్రాజ్యం పీష్వా), బసలత్ జంగ్ (అసఫ్ జా II అన్నయ్య, మార్క్విస్ డి బుస్సీ-కాస్టెల్‌నౌ మద్దతు ) నుండి తరచుగా వచ్చిన బెదిరింపులకు ప్రతిస్పందనగా నిజాం సంతకం చేశాడు. 1798లో ఈస్ట్ ఇండియా కంపెనీతో అనుబంధ కూటమి, రాష్ట్ర రాజధానిని రక్షించడానికి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ బొల్లారం (సికింద్రాబాద్ )ను ఆక్రమించుకోవడానికి వీలు కల్పించింది, దీని కోసం నిజాంలు బ్రిటిష్ వారికి వార్షిక నిర్వహణను చెల్లించారు.[37]
బ్రిటిష్, ఫ్రెంచి వారు దేశంపైకి వచ్చినపుడు నిజాంలు వారి అధికారాన్ని చేరిపోకుండా వారితో స్నేహాన్ని కలుపుకున్నారు. నిజాంలు ఆంగ్లో-మైసూర్ యుద్ధాలలో ముఖ్యమైన పాత్రను పోషించి, వేర్వేరు సమయాల్లో ప్రతి పక్షంతో పొత్తు పెట్టుకున్నారు.
1857 నాటి భారతీయ తిరుగుబాటు నాయకత్వంలో మౌల్వీ అల్లావుద్దీన్, తుర్రేబాజ్ ఖాన్ బ్రిటిష్ రెసిడెన్సీపై దాడులకు నాయకత్వం వహించారు.[38] 1908లో వచ్చిన మూసీనది వరదకు హైదరాబాద్ నగరం దాదాపు దెబ్బతిన్నది. కనీసం 15,000 మంది మరణించారు.[39]
తన తండ్రి తర్వాత 1911లో హైదరాబాద్ ఏడవ, చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ అధికారంలోకి వచ్చాడు. తన సంపదకు విస్తృతంగా ప్రసిద్ధి చెంది, ప్రపంచంలోనే అత్యంత ధనవంతులలో ఒకరిగా పరిగణించబడ్డాడు. ఆధునిక హైదరాబాద్ అభివృద్ధి తొలిసారిగా ఇతని హయాంలోనే జరిగింది. లౌకిక పాలకుడిగా, తిరుమల శ్రీ వేంకటేశ్వర దేవాలయం, తిరుమల, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వంటి వివిధ హిందూ దేవాలయాలకు విరాళాలు, వార్షిక గ్రాంట్లు ఇచ్చేవాడు.[40][41] వేయి స్తంభాల ఆలయ పునర్నిర్మాణం కోసం ఒక లక్ష హైదరాబాదీ రూపాయల గ్రాంట్‌ను విరాళంగా ఇచ్చాడు.[42] పూణేలోని భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో హిందూ పవిత్ర గ్రంథం "మహాభారతం" సంకలనం కోసం 11 సంవత్సరాల పరిశోధన పనుల కోసం డబ్బు, వార్షిక గ్రాంట్‌లను విరాళంగా ఇచ్చాడు.[40][43]
భారత కమ్యూనిస్టు పార్టీకి చెందిన కామ్రేడ్స్ అసోసియేషన్ నేతృత్వంలో 1945 చివరలో తెలంగాణ ప్రాంతంలో రైతు తిరుగుబాటు ప్రారంభమైంది. ఈ తిరుగుబాటును తెలంగాణ తిరుగుబాటు లేదా వెట్టి చాకిరి ఉద్యమం లేదా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అని కూడా పిలుస్తారు. కమ్యూనిస్టులకు వివిధ వర్గాల నుంచి మద్దతు లభించింది.
43% భూస్వాధీనాన్ని కలిగి ఉన్న జాగీర్దారీ వ్యవస్థపై పేద రైతులకు ఫిర్యాదులు ఉన్నాయి. ప్రారంభంలో, రైతులు కమ్యూనిస్టు నీడలో పోరాడిన సంపన్న రైతుల నుండి కూడా మద్దతు పొందారు. 1948 నాటికి సంకీర్ణం విచ్ఛిన్నమైంది.
ప్రారంభంలో, 1945లో జమీందార్లు - దేశ్‌ముఖ్‌లను లక్ష్యంగా చేసుకున్న కమ్యూనిస్టులు, నిజాంకు వ్యతిరేకంగా పూర్తిస్థాయి తిరుగుబాటును ప్రారంభించారు. 1946 మధ్యకాలం నుండి, రజాకార్లు (కాసిం రజ్వీ నేతృత్వంలోని ప్రైవేట్ మిలీషియా), కమ్యూనిస్టుల మధ్య వివాదం మరింత హింసాత్మకంగా మారింది. ఇరుపక్షాలు క్రూరమైన పద్ధతులను అవలంబించాయి. రజాకార్లు గ్రామాలను చుట్టుముట్టారు. అనుమానిత కమ్యూనిస్టులను సామూహికంగా పట్టుకున్నారు, 'పూర్తిగా విచక్షణారహితంగా, వ్యవస్థీకృతంగా' (ఒక కాంగ్రెస్‌వాది ప్రకారం) దోపిడీలు, ఊచకోతలకు పాల్పడ్డారు. భారత ప్రభుత్వ లెక్కల ప్రకారం, 1948 నాటికి దాదాపు 2,000 మందిని కమ్యూనిస్టులు చంపబడ్డారు.[44]
భారతదేశం స్వాతంత్ర్యోత్యమ ఫలితంగా 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. స్వతంత్ర భారతంలో కలవడానికి హైదరాబాద్ నిజాం నిరాకరించాడు. దాంతో ఆపరేషన్ పోలో చేయాల్సివచ్చింది. అప్పుడు హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి 1948లో నిజాం తన రాష్ట్రాన్ని భారతదేశానికి అప్పగించవలసి వచ్చింది.
హైదరాబాద్ సంస్థానాధీశుడు ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ ఆలీ ఖాన్ నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు 1946 నుంచి 1948 మధ్య వీరోచిత పోరాటం చేశారు. దీన్నే తెలంగాణ విమోచనోద్యమంగా పిలుస్తారు. రెండు వందల సంవత్సరాల దోపిడి, అణిచివేతకు నలభై ఏడు సంవత్సరాల తిరుగుబాటు, సాయుధపోరాటం ఒక దశ మాత్రమే. వివిధ సంఘాల, పార్టీల, ప్రజాస్వామికవాదుల, రచయితల, ప్రజల సంఘటిత క్రమ-పరిణామపోరాటమది. హైదరాబాద్ సంస్థానంలో ప్రస్తుత తెలంగాణాతో పాటు మరాఠ్వాడ (మహారాష్ట్ర), బీదర్ (కర్ణాటక) ప్రాంతాలు ఉండేవి. 3 భాషా ప్రాంతాలకు చెందిన మొత్తం 16 జిల్లాలకు గాను 8 జిల్లాలు తెలంగాణా ప్రాంతానికి చెందినవి కాగా, మరాఠా, కన్నడ ప్రాంతాలకు చెందినవి 8 జిల్లాలుండేవి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిననూ నిజాం సంస్థానంలోని ప్రజలకు మాత్రం స్వాతంత్ర్యం లేకపోవడాన్ని ఇక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. దేశమంతటా స్వాతంత్ర్యోత్సవాలతో ప్రజలు ఆనందంతో గడుపుచుండగా నిజాం సంస్థాన ప్రజలు మాత్రం నిరంకుశ బానిసత్వంలో కూరుకుపోయారు. హైదరాబాదు రాజ్యాన్ని పాలిస్తున్న ఏడవ నిజామ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాజ్యాన్ని సొంతం చేసుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తూ రజాకార్లను ఉసిగొల్పాడు. నిజాంకు అండగా ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు గ్రామాలపైబడి దోపిడిచేయడం, ఇండ్లు తగలబెట్టడం[45] నానా అరాచకాలు సృష్టించారు.[46] అతని మతోన్మాద చర్యలు కోరలాల్చి వెయ్యి నాల్కలతో విషంకక్కాయి.[47] హీనమైన బతుకులు వెళ్ళదీస్తున్న జనం గురించి అస్సలు పట్టించుకోకుండా ప్రజల నుండి బలవంతంగా వసూలుచేసుకున్న సొమ్ముతో విలాసాలు, జల్సాలు, భోగభాగ్యాలు చేసుకొనేవారు. దీనితో రామానందతీర్థ నేతృత్వంలో ఆర్యసమాజ్ ఉద్యమాలు, కమ్యూనిష్ఠుల ఆధ్వర్యంలో సాయుధపోరాటాలు ఉధృతమయ్యాయి. మొదట నల్గొండ జిల్లాలో ప్రారంభమైన ఉద్యమం శరవేగంగా నైజాం సంస్థానం అంతటా విస్తరించింది. రావి నారాయణరెడ్డి, చండ్ర రాజేశ్వరరావు, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మభిక్షం, మాడపాటి హనుమంతరావు, దాశరథి రంగాచార్య, కాళోజి నారాయణరావు, షోయబుల్లాఖాన్, సురవరం ప్రతాపరెడ్డి తదితర తెలంగాణ సాయుధ పోరాటయోధులు వారికి స్ఫూర్తినిచ్చే కవులు, రచయితలు మూలంగా 1948లో ఉధృతరూపం దాల్చి చివరికి భారత ప్రభుత్వం సైనిక చర్యతో నైజాం సంస్థానాన్ని 1948 సెప్టెంబరు 18న భారత్ యూనియన్‌లో విలీనం చెంది హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడింది. వెల్లోడి, బూర్గుల రామకృష్ణారావు ఈ కాలంలో ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు.
ఆపరేషన్ పోలో, హైదరాబాద్ "పోలీస్ యాక్షన్" కోడ్ పేరు[48][49] 1948 సెప్టెంబరులో జరిగిన సైనిక చర్య, ఈ చర్యలో భాగంగా భారత సాయుధ దళాలు హైదరాబాద్ రాష్ట్రంపై దాడిచేసి నిజాంను ఓడించి, రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేశాయి.
భారతదేశ విభజన సమయంలో భారతదేశంలోని కొన్ని రాచరిక రాష్ట్రాలు వారి స్వంత భూభాగాలలో స్వయం పాలనను కలిగి ఉన్నాయి. భారత స్వాతంత్ర్య చట్టం 1947 ప్రకారం తమకు అనుకూలమైన దేశాన్ని ఎంపిక చేసుకునే అవకాశం రాష్ట్రాలకు ఉంది. అయితే, 1948 నాటికి దాదాపు అన్ని రాష్ట్రాలు భారతదేశం లేదా పాకిస్తాన్‌లో చేరాయి. ఎక్కువగా హిందువుల జనాభాకు రాజుగా ఉన్న ముస్లిం పాలకుడు నిజాం స్వాతంత్ర్యాన్ని ఎంచుకున్నాడు. రజాకార్లు అని పిలువబడే ముస్లిం కులీనుల నుండి నియమించబడిన క్రమరహిత సైన్యంతో దీనిని కొనసాగించాలని ఆశించాడు.[50] నిజాం కూడా తెలంగాణ తిరుగుబాటుతో చుట్టుముట్టబడ్డాడు.[50]
భారత ప్రభుత్వం, హైదరాబాద్ రాజ్యాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయడంపై నిశ్చయించుకుంది.[50] రజాకార్ల దౌర్జన్యాల మధ్య, భారత హోం మంత్రి సర్దార్ పటేల్ "పోలీసు చర్య"గా పిలవబడే దాడితో హైదరాబాద్[51] ను విలీనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఆపరేషన్ ఐదు రోజులు పట్టింది, ఈ దాడిలో రజాకార్లు ఓడిపోయారు.
ఈ ఆపరేషన్ మతపరమైన మార్గాల్లో భారీ హింసకు దారితీసింది. భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, సుందర్‌లాల్ కమిటీ అని పిలిచే ఒక కమిషన్‌ను నియమించాడు. 2013 వరకు విడుదల చేయని దాని నివేదిక, "ఒక అంచనా ప్రకారం, పోలీసు చర్య సమయంలోనూ, తరువాత 27,000 నుండి 40,000 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు" అని నిర్ధారించారు.[52]
ఆపరేషన్ పోలో తర్వాత, 1948లో హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడింది. చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజప్రముఖ్‌గా పనిచేశాడు. ఎం.కె. వెల్లోడి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు.
భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి 1953 డిసెంబరులో, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ నియమించబడింది.[53] 1956 ఫిబ్రవరి 20న తెలంగాణా ప్రయోజనాలను కాపాడే వాగ్దానాలతో తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాలను కలపడానికి తెలంగాణ నాయకులు, ఆంధ్ర నాయకుల మధ్య ఒప్పందం కుదిరింది. 1956లో పునర్వ్యవస్థీకరణ తరువాత, తెలంగాణా ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన కొన్నాళ్ళకే మళ్ళీ వేర్పాటు ఉద్యమాలు తలెత్తాయి. 1969లో మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉధృతరూపం దాల్చింది. అప్పుడు ప్రత్యేక తెలంగాణ నేపథ్యంలో ఏర్పడిన తెలంగాణ ప్రజా సమితి పార్టీ 1971లో 11 లోక్‌సభ స్థానలలో విజయం సాధించింది. 2001, ఏప్రిల్ 27న కె.చంద్రశేఖర్ రావు ప్రత్యేక తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు.
2009 లో కే.సి.ఆర్ నిరాహరదీక్ష విరమింపచేయడానికి కేంద్రప్రభుత్వం తెలంగాణా ఏర్పాటు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడంతో ఈ ఉద్యమాలు మరింత బలం పుంజుకున్నాయి. కేంద్రప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి అందరికీ ఆమోదమైన లక్ష్యంకొరకు శ్రీకృష్ణ కమిటీని నియమించగా ఆ కమిటీ ఆరు ప్రతిపాదనలు చేసినా ఫలితంలేకపోయింది. 2011 నుంచి తెలంగాణ ఉద్యమ నాయకత్వం "ఐక్య కార్యాచరణ సమితి" చేతుల్లోకి వెళ్ళడంతో విద్యార్థులు, ఉద్యోగసంఘాలు చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ అంతటా ఉద్యోగులు, కార్మికులు 2011లో 42 రోజుల సమ్మె చేశారు. 2013 జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 10 జిల్లాలతో కూడిన తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకుంది. ప్రభుత్వ ఉద్యోగసంఘాల నాయకత్వంలో రెండు నెలలపైబడి సమైక్యాంధ్ర ఉద్యమం నడిచింది. 2013 అక్టోబరు 3న జరిగిన కేంద్రప్రభుత్వ మంత్రివర్గ సమావేశంలో తెలంగాణా ఏర్పాటును ఆమోదించారు. తదుపరి చర్యగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి, రెండు రాష్ట్రాల సమస్యలపై చర్చించి, వాటి పరిష్కార వివరాలతో కేబినెట్ నోట్, బిల్లు తయారీ జరిగింది.[54] ఆ తరువాత రాష్ట్రపతి పంపిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును[55] శాసనసభ, శాసనమండలిలో సుదీర్ఘ చర్చలు పూర్తికాకముందే, ముఖ్యమంత్రి ప్రతిపాదించిన తిరస్కరించే తీర్మానం పై మూజువాణీ వోటుతో సభలు అమోదముద్ర వేశాయి. 2014, ఫిబ్రవరి 18న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతుతో లోక్‌సభ ఆమోదం లభించింది. 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం తెలిపింది. సీమాంధ్రకు న్యాయం చేయడానికి వెంకయ్యనాయుడు ప్రతిపాదించిన సవరణలను కొంత వరకు తృప్తిపరచే విధంగా ప్రధాని ఆరుసూత్రాల ప్యాకేజీని ప్రకటించిన పిదప, బిల్లుకు యధాతథంగా మూజువాణీ వోటుతో అమోదముద్ర పడింది.[56][57] 2014 జూన్ 2 నాడు దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది.
2013, జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సిఫార్సు చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. తెలంగాణ ఏర్పాటుకు భారత పార్లమెంట్ ఉభయ సభల్లో 2014 ఫిబ్రవరిలో[58] బిల్లును ప్రవేశపెట్టగా, 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం బిల్లును వాయవ్య ఆంధ్రప్రదేశ్ నుండి పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం భారత పార్లమెంటు ఆమోదించింది.[59] 2014, మార్చి 1న రాష్ట్రపతి ఆమోదం లభించింది.[60]
2014, జూన్ 2న తెలంగాణ రాష్ట్రం అధికారికంగా ఏర్పాటయింది. ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మెజారిటీ సాధించిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు.[61] హైదరాబాద్ 10 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండింటికీ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది.
{{cite book}}
: ISBN / Date incompatibility (help)CS1 maint: others (link)
{{cite book}}
: CS1 maint: multiple names: authors list (link)
{{cite book}}
: ISBN / Date incompatibility (help)
{{cite web}}
: More than one of |archivedate=
and |archive-date=
specified (help); More than one of |archiveurl=
and |archive-url=
specified (help)