త్రిపురనేని మహారథి | |
---|---|
జననం | పసుమర్రు గ్రామం, గుడివాడ తాలూకా, కృష్ణా జిల్లా | 1930 ఏప్రిల్ 20
మరణం | 2011 డిసెంబరు 23 | (వయసు: 81)
వృత్తి | సినీ రచయిత |
తల్లిదండ్రులు |
|
త్రిపురనేని మహారథి సినీ మాటల రచయిత. అల్లూరి సీతారామరాజు సినిమాకు మాటల రచయితగా మంచి గుర్తింపు పొందాడు.[1]
ఇతని అసలు పేరు త్రిపురనేని బాలగంగాధరరావు. ఇతడు ఏప్రిల్ 20, 1930 న కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా పసుమర్రు గ్రామంలో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు పుణ్యవతి, సత్యనారాయణలు. ఇతడు బాల్యం నుంచీ అక్షరాలపై మమకారం పెంచుకొన్నాడు. రామాయణ, మహాభారతాలను చిన్నప్పుడే చదివేశాడు. బాధర్ అనేది ఇతని కలంపేరు. ఆ పేరుతో పత్రికలకు పద్యాలు, గేయాలు పంపించేవాడు. తండ్రి మరణంతో ఆయన చదువు ఎక్కువ కాలం సాగలేదు. ఆస్తులన్నీ హారతి కర్పూంలా కరిగిపోవడంతో కుటుంబ బాధ్యతను మోయాల్సివచ్చింది. యువకుడిగా ఉన్నప్పుడే ‘క్విట్ ఇండియా’ అంటూ బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా సమరనాదం వినిపించాడు.[2]
ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో ఇతడు కొంతకాలం వ్యవసాయం చేశాడు. హైదరాబాద్‌లో గుమస్తాగా పనిచేశాడు. దక్కన్ రేడియోలో ఉద్యోగం వచ్చింది. అది కూడా ఎక్కువ కాలం నడవలేదు. ‘మీజాన్’ అనే పత్రికలో ఉప సంపాదకుడిగా కొన్నాళ్లు పనిచేశాడు. తెలంగాణ భూపోరాటంలో చురుగ్గా పాల్గాన్నాడు. ఈయన పేరు పోలీసు రికార్డులకు కూడా ఎక్కింది. ‘పాలేరు’ అనే సినిమాకి ప్రొడక్షన్ మేనేజరుగా పనిచేశాడు. ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.[2]
ఆ తరువాత ఇతని మనసు దర్శకత్వంపై మళ్లి మద్రాసుకు వెళ్ళాడు. ‘ఎం.ఎల్.ఏ.’ సినిమాకి కె.బి. తిలక్ దగ్గర సహాయకుడిగా పనిచేశాడు. కె.ఎస్. ప్రకాశరావు, వి.మధుసూదనరావుల సినిమాలకీ పనిచేశాడు. మాటల రచయితగా ఇతని ప్రయాణం అనువాద చిత్రంతో మొదలైంది. ‘శివగంగ సీమై’ చిత్రాన్ని ‘యోధాన యోధులు’గా తెలుగులో అనువదించారు. దానికి మహారథి మాటలు రాశాడు. ‘బందిపోటు’ ఇతని తొలి డైరెక్టు తెలుగు చిత్రం. ‘సతీ అరుంధతి’, ‘కంచుకోట’, ‘పెత్తందారు’ ఇవన్నీ ఇతనికి రచయితగా తెలుగు చిత్రసీమలో స్థానాన్ని సుస్థిరం చేశాయి. దాదాపు 150 సినిమాలకు సంభాషణలు అందించాడు. నిర్మాతగా ‘రైతుభారతం’, ‘దేశమంటే మనుషులోయ్’, ‘మంచిని పెంచాలి’, ‘భోగిమంటలు’ సినిమాలు తీశాడు.[2]
ఇతడు రాజకీయాలపై కూడా ఆసక్తి చూపించాడు. 1977లో బోధన్ నుంచి జనతాపార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయాడు. 2005లో ‘త్రిలింగ ప్రజా పార్టీ’ స్థాపించాడు.[2]