డాక్టర్ గడ్డం పద్మజారెడ్డి | |
---|---|
జననం | 1 జనవరి 1967 |
జాతీయత | భారతదేశం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | డాక్టర్, కూచిపూడి నర్తకి |
జీవిత భాగస్వామి | గడ్డం శ్రీనివాస రెడ్డి |
పిల్లలు | ప్రణవ్ |
తల్లిదండ్రులు | డాక్టర్ జీవీరెడ్డి, స్వరాజ్యలక్ష్మి |
బంధువులు | గడ్డం గంగారెడ్డి[1] |
సన్మానాలు | పద్మశ్రీ (2022) |
పద్మజారెడ్డి ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి. పద్మజారెడ్డి కూచిపూడి నాట్యం లోని వివిధ రూప కళను ప్రజా చైతన్యం నింపే ఆధునిక నాటకాలుగా ప్రదర్శించారు. ప్రణవ్ అకాడమీని స్థాపించి నృత్య శిక్షణ ఇస్తున్నారామె ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చారు. ప్రముఖ నర్తకి శోభానాయుడు శిష్యురాలు. పద్మజా 2022లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంది.[2]
ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన వారు. వారి గ్రామానికి సమీపంలో కూచిపూడి గ్రామం ఉండటంతో ఆమె నృత్యం చేర్చుకోవాలని సంకల్పించారు. తన ఎనిందవ యేట హైదరాబాదు వెళ్ళి ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి అయిన శోభానాయుడు వద్ద శిక్షణ పొందారు. ఆమెకు నిజామబాదు మాజీ పార్లమెంటు సభ్యుడు గడ్డం గంగారెడ్డి కుమారుడు అయిన శ్రీనివాసరెడ్డితో 1988లో వివాహం జరిగింది. వారి కుమారుడు ప్రణవ్ పేరిట "ప్రణవ్ కూచిపూడి నృత్య అకాడమీ"ని స్థాపించారు. దాదాపు ఐదువందల మందికి శిక్షణనిచ్చారు. కొండాపూర్, అమీర్‌పేట్, జేఎన్‌టీయూలో ఆ సంస్థలున్నాయి. మరుగున పడిపోతున్నభారతీయ సంస్కృతిని రాబోయే తరాలకు తెలియజేయడం కోసమే శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారామె. అనేక దేశాలలో నృత్యప్రదర్శనలిచ్చారు. శివ హేల, భ్రూణ హత్యలు, కల్యాణ శ్రీనివాస చరితం, అన్నమయ్య పద నర్తన శోభ, శ్రీకృష్ణ పారిజాతం, రాధే శ్రీ కృష్ణామృత్, వజ్ర భారతి, సీతా స్వయంవరం, సీజన్ ఆఫ్ ఫ్లవర్స్, నమస్తే ఇండియా, రామాయణం వంటి ఇతివృత్తంగా తీసుకొని కూచిపూడి నృత్య ప్రదర్శనలిచ్చారు.[3]ఆమె కాకతీయుల చరిత్రను వెలుగులోకి తెచ్చి చారిత్రక నృత్య రూపకాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది.[4]
ఆమె 2015 కి గానూ సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్నారు. 45 ఏళ్లుగా కూచి పూడి నృత్య ప్రదర్శనలో విశేష ప్రతిభకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆమెను ఈ అవార్డుతో సత్కరించింది. 2016 అక్టోబరు 4 న డిల్లీలోని రాష్ట్రపతి భవన్‍లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమెకు ఈ అవార్డును ప్రధానం చేశారు. ఈ సందర్భంగా పద్మజా రెడ్డి మాట్లాడుతూ ఈ అవార్డును అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. భ్రూణ హత్యల నివారణకు ప్రకృతి, పంచ భూతలపై ప్రజల్లో అవగాహన కోసం పద్మజా రెడ్డి అనేక నృత్యా ప్రదర్శనలు చేపట్టారు.[5]