ప్రతాప్ చంద్ర ముజుందార్ (బెంగాళీ:প্রতাপ চন্দ্র মজুমদার) Protap Chunder Mozoomdar) (1840-1905) హిందూ సంస్కరణా ఉద్యమమైన బ్రహ్మ సమాజము యొక్క సభ్యుడు, కేశవ చంద్ర సేన్ యొక్క అనుయాయి. ఈయన యేసుక్రీస్తు యొక్క బోధనలలో ప్రాచ్య దర్శనాల ప్రభావంపై పరిశోధనలకుగాను ప్రసిద్ధుడైనాడు. భారతదేశంలో హిందూ, క్రైస్తవ దర్శనాల మధ్య జరిగిన పరస్పర సంభాషణలకు ఈయన చక్కని ఉదాహరణ. ముజుందార్, ఓరియంటల్ క్రైస్ట్ అనే గ్రంథాన్ని రచించాడు.
కేశవ చంద్ర సేన్, ఆయన సహచరులు, నలుగురు బ్రహ్మ సమాజీయులు, బ్రహ్మ సమాజం యొక్క ఆదర్శాలకు, ప్రపంచంలోని ప్రముఖ దర్శనాలైన హిందూ, క్రైస్తవ, బౌద్ధ , ఇస్లాం దర్శనాలకున్న సంబంధాలను అధ్యయనం చేసి నివేదించాలని నిర్ణయించారు. హిందూ మతాన్ని పరిశీలించడానికి గురు గోవింద రేను, బౌద్ధ దర్శనానికి అఘోర నాథ్ గుప్తను, ఇస్లాం దర్శనానికి గిరీష్ చంద్ర సేన్‌ను పురమాయించారు. క్రైస్తవ దర్శనాన్ని పరిశీలించడానికి మజుందార్ నియమితుడయ్యాడు. ఈ అధ్యయన ఫలితంగా వెలువడిన ఓరియంటల్ క్రైస్ట్ గ్రంథం 1869లో ప్రకటించబడింది. ఈ గ్రంథంపై పాశ్చాత్యంలో విస్తృతంగా చర్చలు జరిగాయి. తత్ఫలింగా మజుందార్, మాక్స్ ముల్లర్ల మధ్య క్రైస్తవ, హిందూ మతాల సంబంధాలపై ఉత్తరప్రత్యుత్తరాలు నడిచాయి. ఈ ఉత్తరప్రత్యుత్తరాలును మజుందార్ ప్రచురించినప్పుడు బ్రిటన్, భారతదేశం ఇరుదేశాల్లోనూ పెద్ద వివాదం లేచింది. మజుందార్ ఇప్పుడు తను క్రైస్తవుడినని బహిరంగంగా ఒప్పుకునేట్టు చేసేందుకు ముల్లర్ చేసిన ప్రయత్నాలను మజుందార్ తిరస్కరించాడు. క్రైస్తవుడనే ముద్ర తనకు యేసుక్రీస్తు పట్ల ఉన్న సదభిప్రాయానికి సరైన రీతిలో అద్దంపట్టదని తిరస్కరించాడు. మజుందార్ యేసును త్యాగనిరతికి ప్రతీకగా గుర్తించి, యేసు యొక్క చర్యలను, దైవాంశిక ప్రకటనను బ్రహ్మసమాజపు తత్త్వాలకు అనుగుణంగా వివరించాడు. తనవంతుగా ముల్లర్, క్రైస్తవులు బ్రహ్మసమాజీయుల నుండి నేర్చుకొని, సాంప్రదాయక క్రైస్తవ భావనైన పాప ప్రాయశ్చిత్తానికి తిలోదాలకిలివ్వాలని సూచించాడు.[1]