బి.రాజం అయ్యర్ | |
---|---|
జననం | బాలసుబ్రమణియం రాజం అయ్యర్ 15 జూలై 1922 కారైకుడి, రామ్‌నాద్ జిల్లా, తమిళనాడు |
మరణం | 2009 మే 3 | (వయసు 86)
వృత్తి | కర్ణాటక శాస్త్రీయ గాత్ర సంగీత విద్వాంసుడు. |
బి.రాజం అయ్యర్ (15 జూలై 1922 – 3 మే 2009) ఒక కర్ణాటక సంగీత గాత్ర విద్వాంసుడు. ఇతడిని 2003లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.
ఇతడు తమిళనాడు రాష్ట్రం, రామ్‌నాద్ జిల్లా (ప్రస్తుతం శివవంగ జిల్లా)లోని కారైకుడి గ్రామంలో జన్మించాడు.[1] ఇతని తండ్రి బాలసుబ్రహ్మణ్య అయ్యర్, తల్లి లక్ష్మీ అమ్మాళ్.[2]
ఇతడు కర్ణాటక సంగీతాన్ని తిరుకోకర్ణం సుబ్బయ్య భాగవతార్ వద్ద నేర్చుకున్నాడు. తరువాత గోటువాద్య, జలతరంగ నిపుణుడు కున్నక్కుడి గణపతి అయ్యర్ వద్ద ఐదు సంవత్సరాలు సంగీతం నేర్చుకున్నాడు. అరియకుడి రామానుజ అయ్యంగార్ వద్ద 10 సంవత్సరాలు గురుకుల పద్దతిలో శిక్షణ తీసుకున్నాడు. ఇతడు రామానుజ అయ్యంగార్ ముఖ్యమైన శిష్యునిగా ఎదిగి అతని శైలిలో రాగాలాపన చేయడంలో నిష్ణాతుడయ్యాడు. ఇతడు టి.ఎల్.వెంకటరామ అయ్యర్ వద్ద ముత్తుస్వామి దీక్షితుల కృతులను నేర్చుకున్నాడు.[2]
ఇతడు ఆండాళ్ వ్రాసిన తిరుప్పావై 30 పాశురాలకు స్వరకల్పన చేశాడు. అరుణాచల కవి రచించిన "రామ నాటకం" లోని అనేక పాటలకు సంగీతం సమకూర్చి ప్రకటించాడు. ఇతడు ముత్తుస్వామి దీక్షితుల అనేక కీర్తనలకు స్వరకల్పన చేసి వాటి స్వరలిపులను 1956లో స్వదేశిమిత్ర అనే తమిళ వారపత్రికలో వరుసగా ప్రచురించాడు. ఇతడు 1943 నుండి నాలుగు సంవత్సరాల పాటు తిరువాంకూరు రాజ కుటుంబానికి సంగీత గురువుగా ఉన్నాడు. మద్రాసు విశ్వవిద్యాలయం, ఢిల్లీ విశ్వవిద్యాలయం సెలెక్షన్ కమిటీలలో సభ్యుడిగా నియమించబడ్డాడు. మద్రాసు సంగీత అకాడమీ నిపుణుల సంఘంలో సభ్యుడిగా పనిచేసి సుబ్బరామ దీక్షితార్ రచించిన "సంగీత సంప్రదాయ ప్రదర్శిని"[3] అనే అపురూపమైన గ్రంథం తమిళ అనువాదాన్ని అకాడమీ తరఫున ప్రచురించాడు.[2]
ఇతడు 1942లో తిరువయ్యారులో త్యాగరాజ ఆరధనోత్సవాలలో తన మొదటి కచ్చేరీ నిర్వహించాడు. మద్రాసులో ఇతని మొట్టమొదటి ప్రదర్శన 1956లో జగన్నాథ సభ, ఎగ్మోరులో జరిగింది. తరువాత ఇతడు అనేక ప్రదర్శనలు ఇచ్చాడు.[2]
ఇతడు ఆల్ ఇండియా రేడియోలో ఏ గ్రేడు కళాకారుడిగా కొనసాగాడు.[4]
ఇతని శిష్యగణంలో వైజయంతిమాల బాలి, జయలలిత, మల్లికా శివశైలం, ఎన్.వీరరాఘవన్, పద్మావతి, ప్రమీలా గురుమూర్తి, జయంతి రవి, చంద్రికా రాజారామన్, నామగిరి రమేష్, రజిని హరిహరన్, ఆనంది ప్రకాష్, గౌరీ రామనారాయణ్, షీలా బాలాజి, మల్లికా శ్రీనివాసన, గాయత్రి మహేష్, ఉన్నికృష్ణన్, జయలక్ష్మి సంతానం, పద్మా శాండిల్యన్, రమా రవి, సిరిగుడి సిస్టర్స్, వి.సుబ్రహ్మణ్యం, సీతాలక్ష్మి రవి, వి.కె.మణిమారన్, కస్తూరి శివకుమార్ భట్, శివశక్తి శివనేశన్, వై.యాదవన్ మొదలైన వారున్నారు.
ఇతడు తన 86వ యేట 2009, మే 3వ తేదీన స్వల్ప అస్వస్థతతో మరణించాడు.[7]