భోగిలాల్ పాండ్య | |
---|---|
![]() | |
జననం | 1904, నవంబర్ 13 సిమల్వారా, దుంగార్‌పూర్ జిల్లా, రాజస్థాన్ |
మరణం | 31 మార్చి 1981 | (aged 76)
వృత్తి | స్వాతంత్ర్య సమర యోధుడు, సామాజిక కార్యకర్త |
జీవిత భాగస్వామి | మణిబెన్ |
భోగిలాల్ పాండ్య రాజస్థాన్ రాష్ట్రంలోని దుంగార్‌పూర్‌కు చెందిన భారత స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక కార్యకర్త. భారత ప్రభుత్వం అతడు చేసిన సామాజిక సేవలకు గాను అతనికి ఏప్రిల్ 3, 1976 న పద్మభూషణ్‌ను ప్రదానం చేసింది. పద్మభూషణ్ భారతదేశంలో అందించే మూడవ అత్యున్నత పౌర పురస్కారం.[1]
భోగిలాల్ పాండ్యా నవంబర్ 13, 1904 న రాజస్థాన్ లోని దుంగార్‌పూర్ జిల్లాలో గల సిమల్వారా గ్రామంలో జన్మించాడు. పాండ్య 1920 లో గుజరాత్‌లోని సబర్కాంతలోని మల్పూర్ జిల్లాలోని నానావాడ గ్రామానికి చెందిన మణిబెన్‌ని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
1938 లో, పాండ్యా రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్, ఉదయ్‌పూర్, జైపూర్, జైసల్మార్ ప్రాంతాలలో సమాజసేవ చేసే సేవాసంఘ్ అనే సంస్థకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఈ సంస్థ ద్వారా, పాండ్య గ్రామాల్లోని పేద విద్యార్ధుకు విద్యనందించడం కోసం, అణగారిన గిరిజన ప్రజల జీవితాలను మెరుగుపరచడం కోసం పాటుపడ్డాడు. 1948 లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, పాండ్యా రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి పదవులకు నియమించబడ్డాడు. 1948, 1956 మధ్య కాలంలో అతను పారిశ్రామిక మంత్రిగా, దేవదాయ శాఖా మంత్రిగా పనిచేశాడు. 1969, 1977 మధ్య కాలంలో, అతను ఖాదీ బోర్డ్ ఆఫ్ రాజస్థాన్ లో ఛైర్మన్ పదవిని స్వీకరించాడు.
భోగిలాల్ పాండ్య దేశానికి విశిష్ట సేవ చేసినందుకు, పేదలు, అణగారిన వర్గాల కోసం, విద్యా హక్కుల కోసం అతను పోరాడినందుకు, అతన్ని రాజస్థాన్ ప్రజలు "వహ్‌గాడ్ గాంధీ" అని పిలుస్తారు. అతని ఇల్లు దుంగార్‌పూర్‌లోని గాంధీ ఆశ్రమం ప్రాంతంలో ఉంది.
భోగిలాల్ పాండ్య తన 77 వ ఏట 1981 మార్చి 31 న మరణించాడు. రాజస్థాన్ ప్రభుత్వం అతని జ్ఞాపకార్థం దుంగార్‌పూర్ ప్రభుత్వ కళాశాలకు భోగిలాల్ పాండ్య ప్రభుత్వ కళాశాల అని పేరు పెట్టింది.[2]