రాజా రాధా రెడ్డి | |
IFFI (2010)లో రాజా రెడ్డి (మధ్య), రాధా రెడ్డి (కుడి) | |
జననం | 1943 నర్సాపూర్, ఆదిలాబాదు జిల్లా |
జాతీయత | భారత్ |
రంగం | శాస్త్రీయ నృత్యం నర్తకులు |
ఉద్యమం | కూచిపూడి |
పురస్కారాలు | పద్మ భూషణ్ |
కూచిపూడి రంగం లోనే కాక యావత్ కళాలోకానికి రాజా-రాధా రెడ్డిలుగా సుపరిచితులయిన రాజారెడ్డి, రాధారెడ్డి దంపతులు ఆదిలాబాదు జిల్లాకు చెందినవారు. వీరు న్యూ ఢిల్లీలో నృత్య తరంగిణి అను నాట్య పాఠశాలను ఏర్పరిచి ఔత్సాహిక నాట్య కళాకారులను తీర్చిదిద్దుతున్నారు. రాజా రెడ్డి గారి ద్వితీయ సతీమణి కౌసల్యా రెడ్డి,[1] [2] రాజా రాధా రెడ్డిల కుమార్తె యామినీ రెడ్డి[3], రాజా కౌసల్యా రెడ్డిల కుమార్తె భావనా రెడ్డి కూడా ప్రముఖ కూచిపూడి కళాకారులే.[2] భారతదేశామంతటా అనేక నృత్యప్రదర్శనలు ఇచ్చిన రాజా రాధా రెడ్డిలను భారత ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారంతో గౌరవించింది.[4] [5] [6]
రాజా రెడ్డిగారు 1943, అక్టోబర్ 6 న ఆదిలాబాద్ జిల్లా నర్సాపూర్ గ్రామంలో సామాన్య వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. రాధారెడ్డి 1952, ఫిబ్రవరి 15 న జన్మించారు. వీరిది బాల్య వివాహం. వీరిరువురు వేదాంతం ప్రహ్లాదశర్మ గారి దగ్గర శిష్యరికం చేసారు. ఏలూరు లోని కళాక్షేత్రంలో కూచిపూడి నృత్యాన్ని అభ్యసించారు.[7][8]
రాజా రెడ్డిగారికి చిన్ననాటి నుండి కూచిపూడి భాగవతం పైన ప్రత్యేక శ్రద్ధ. ఏలూరులో చిన్న చిన్న నృత్య ప్రదర్శనలు ఇచ్చిన తరువాత 1967 వ సంవత్సరం ప్రభుత్వ ఉపకారవేతనం సహాయంతో ఢిల్లీలోని మాయారావ్ కళాశాలనందు కూచిపూడి నృత్యాన్ని అభ్యసించారు.[9] తరువాత భారతదేశములోనే కాక అమెరికా, క్యూబా, రష్యా, ఫ్రాన్స్ ఇలా ప్రపంచమంతటా నృత్యప్రదర్శనలిచ్చారు. కృష్ణాసత్యలుగా శివపార్వతులుగా ఈ దంపతుల లయబద్ధ నృత్యానికి నాటి ప్రధాని ఇందిరాగాంధీనే కాక క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో వంటివారి నుండి ప్రశంసలు అందాయి. సంప్రదాయ నృత్యరీతులకు పెద్దపీట వేస్తూనే కూచిపూడి నృత్యానికి ఆధునిక సొబగులద్దారు.[9]
తమ నాట్యప్రదర్శనలతో కూచిపూడి ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపచేసిన వీరు న్యూఢిల్లీలో నాట్య తరంగిణి అను కళాశాలను ఏర్పరిచి భావితరాలకు శిక్షణ ఇస్తున్నారు. వీరి కుటుంబానికే చెందిన కౌసల్యా రెడ్డి, యామినీ రెడ్డి, భావనా రెడ్డిలు ప్రముఖ కూచిపూడి కళాకారులుగా వెలుగొందుతున్నారు. వీరంతా కూచిపూడి సాంప్రదాయ ఒరవడిని కొనసాగిస్తూ ఇప్పటికీ దేశవిదేశాలలో అనేక ప్రదర్శనలు ఇస్తున్నారు.
ఉత్తర భారతదేశంలో శాస్త్రీయ నృత్యమైన కూచిపూడి శైలిని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ప్రారంభించిన నాట్య తరంగిణి దాని లక్ష్యాన్ని మరింతగా ప్రచారం చేయడానికి హైదరాబాదు శాఖను తదుపరి కాలంలో ప్రారంభించారు. సాధారణ తరగతులతో పాటు, నాట్య తరంగిణి తన విద్యార్థుల అభ్యాసాన్ని మెరుగుపరచడానికి నృత్యం, సంగీత రంగానికి చెందిన ప్రసిద్ధ కళాకారులచే వర్క్‌షాప్‌లు, సెషన్లను కూడా చురుకుగా నిర్వహిస్తుంది.
కూచిపూడి నృత్యరంగానికి వీరు చేసిన కృషికిగాను 1984వ సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మశ్రీతోను 1991వ సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డుతోను సత్కరించింది. 2000వ సంవత్సరంలో భారతదేశ తృతీయ అత్యున్నత పౌరపురస్కారమైన పద్మ భూషణ్ వీరిని వరించింది. 2010వ సంవత్సరంలో హైదరాబాద్ విశ్వవిద్యాలయం వారు రాజారెడ్డి రాధారెడ్డిగార్లను గౌరవ డాక్టరేట్ తో సత్కరించారు.[8]