వంశీ | |
---|---|
![]() | |
జననం | నల్లమిల్లి భామిరెడ్డి 20 నవంబరు 1956 |
వృత్తి | దర్శకుడు రచయిత స్క్రీన్‌ప్లే రచయిత సంగీతదర్శకుడు |
వంశీ తెలుగు సినిమా దర్శకుడు, రచయిత. అసలు పేరు నల్లమిల్లి భామిరెడ్డి .ఈయన సినిమాల కథలు సహజంగా ఉంటూ పల్లె అందాలను ఆవిష్కరిస్తుంటాయి.
వంశీ తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రపురం దగ్గరలో ఉన్న పసలపూడి అనే గ్రామంలో 1956, నవంబరు 20 న పుట్టి అక్కడే పెరిగాడు. ప్రాథమిక విద్యను అక్కడే పూర్తి చేశాడు.[1]
తెలుగు సినీ చరిత్రలో ఆణిముత్యమైన శంకరాభరణం సినిమాకు వంశీ సహాయ దర్శకుడిగా వ్యవహరించాడు. దర్శకుడిగా ఆయన మొదటి సినిమా 1982లో చిరంజీవి, సుహాసిని, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రధారులుగా నటించిన మంచు పల్లకి అనే సినిమా. ఈ సినిమాకు యండమూరి వీరేంద్రనాథ్ రచయిత. యండమూరి, చిరంజీవి కలయికలో వచ్చిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం.
1984లో ఆయన రూపొందించిన సితార సినిమా విమర్శకుల మన్ననలనందుకుంది. ఇదే సినిమాతో భానుప్రియ తెలుగు సినిమాకు కథానాయికగా పరిచయమైంది. ఆయన రూపొందించిన చాలా వరకు సినిమాలకు ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించాడు.
వంశీ దర్శకత్వం వహించిన అనేక తెలుగు సినిమాలలో ప్రస్పుటంగా కనిపించే అంశములు కామెడీ, తెలుగువారి వ్యావహారిక పద్ధతులు. గోదావరి పట్ల వంశీకి వున్న ప్రేమ అంతా ఇంతా కానిది. ఆయన ప్రతి సినిమాలో ఏదో ఒక పాత్ర గోదావరి జిల్లాతో సబంధముండి వుంటుంది.
వంశీపై తెలుగు, తమిళ సినీదర్శకులు, సాంకేతిక నిపుణులు బాపు, భారతీరాజా, విశ్వనాథ్, బాలచందర్, పుట్టణ్ణకణగాళ్, ఇళయరాజాల ప్రభావం ఉంది. తాను దర్శకుణ్ణి కావడానికి వీరి ప్రభావమే కారణమని, వీరు తనకు గురువులని పేర్కొంటారు.[2] ఆయన మిస్టరీ సినిమాలపై సుప్రసిద్ధ ఆంగ్ల దర్శకుడు, మాస్టర్ ఆఫ్ సస్పెన్స్‌గా పేరుపొందిన ఆల్‍ఫ్రెడ్ హిచ్‌కాక్ ప్రభావం ఉంది.