సింగీతం శ్రీనివాసరావు | |
---|---|
జననం | |
వృత్తి | సినిమా దర్శకుడు, రచయిత |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | సినిమా దర్శకుడు |
జీవిత భాగస్వామి | లక్ష్మీ కల్యాణి[1] |
తల్లిదండ్రులు |
|
సింగీతం శ్రీనివాసరావు ప్రతిభాశాలురైన సినిమా దర్శకులలో ఒకరు.[1] తెలుగు, తమిళం, కన్నడ భాషలలో సందేశాత్మకమైవీ, ప్రయోగాత్మకమైనవీ, కథాభరితమైనవీ- ఇలా వైవిధ్యం గల పెక్కు సినిమాలకు దర్శకత్వం వహించి ఆయన ప్రేక్షకులనూ, విమర్శకులనూ మెప్పించాడు. మయూరి, పుష్పక విమానం, ఆదిత్య 369, మైఖేల్ మదన్ కామరాజు వంటి వైవిధ్యము గల సినిమాలకు దర్శకత్వము వహించాడు. ఇంకా ఆయన మంచి సంగీత దర్శకుడు, కథకుడు కూడా.
సింగీతం శ్రీనివాసరావు 1931 సెప్టెంబరు 21న నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించాడు. తండ్రి ఒక హెడ్‌మాస్టరు. తల్లి వయొలిన్ వాయిద్య నిపుణురాలు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చదివేప్పుడు శ్రీనివాసరావుకు హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ పర్వేక్షణలో నాటకరంగంలో ప్రవేశం ఏర్పడింది. కళాశాల రోజుల్లోనే హాలీవుడ్ సినిమాలు బాగా చూసేవాడు.[2] డిగ్రీ వచ్చిన తరువాత సూళ్ళూరుపేటలో ఉపాధ్యాయవృత్తి సాగించాడు. స్వయంగా రచించిన నాటకాలు (బ్రహ్మ, అంత్యఘట్టం) తన విద్యార్ధులతో ప్రదర్శింపజేశాడు. రవీంద్రనాధ టాగూరు నాటకం "చిత్ర"ను "చిత్రార్జున" అనే సంగీతనాటకంగా రూపొందించి ప్రదర్శించి ప్రశంసలు అందుకొన్నాడు. ఈ నాటకాన్ని ఢిల్లీలో జవహర్ లాల్ నెహ్రూ చూశాడు. టామ్ బుచాన్ అనే స్కాటిష్ నాటకకారుడు ఈ నాటకాన్ని ఆంగ్లంలోకి అనువదించి ఒక అమెరికన్ టెలివిజన్ ఛానల్‌లో ప్రసారం చేశాడు. కొంతకాలం శ్రీనివాసరావు "తెలుగు స్వతంత్ర" పత్రికలో రచనలు (ప్రధానంగా ఇంటర్వ్యూలు) చేశాడు.
1960లో లక్ష్మీకల్యాణిని సింగీతం శ్రీనివాసరావు వివాహం చేసుకున్నాడు. స్క్రిప్ట్ రచనలో తోడ్పడుతూ ఆయనకు సినీ కెరీర్‌లో లక్ష్మీ కల్యాణి కీలక పాత్ర పోషించింది. సింగీతం శ్రీనివాసరావు తన సతీమణి పేరుపై ‘శ్రీకల్యాణీయం’ అనే ఓ పుస్తకాన్ని 2012లో రాశాడు. కొంత కాలం అనారోగ్యంతో బాధపడిన లక్ష్మీ కల్యాణి 2022 మే 28న తుది శ్వాస విడిచింది.[3]
కానీ చలనచిత్ర రంగం శ్రీనివాసరావుకు ప్రధాన ధ్యేయం. పట్టు వదలకుండా సుప్రసిద్ధ దర్శకుడు కె.వి.రెడ్డి వెంటబడి ఆయనకు అనుచరునిగా పనిచేయడం మొదలుపెట్టాడు. మాయాబజార్ చిత్రంతో మొదలుపెట్టి చాలా చిత్రాలలో కె.వి.రెడ్డి చేతిక్రింద పనిచేశాడు. పట్టాభి రామిరెడ్డి కన్నడంలో యు.ఆర్.అనంతమూర్తి నవల ఆధారంగా సంస్కార సినిమా తీయ సంకల్పించినపుడు శ్రీనివాసరావును ఎక్సిక్యూటివ్ డైరెక్టరుగా తీసుకొన్నాడు. ఈ సినిమాకు రాష్ట్రపతి బంగారు పతకం లభించింది.
1972లో సింగీతం పూర్తి దర్శకత్వం వహించిన నీతి నిజాయితీ సినిమాను విమర్శకులు ప్రశంసించారుగాని ఆర్ధికంగా విఫలమయ్యింది. 1975లో తీసిన జమీందారుగారి అమ్మాయి ఆయన మొదటి విజయవంతమైన చిత్రం. కాని 1976లో వచ్చిన అమెరికా అమ్మాయి అన్ని వర్గాల ప్రేక్షకులనూ మెప్పించడమే గాక సంగీత పరంగా మంచి విజయం సాధించింది. ఆ కోవలోనే పంతులమ్మ విజయవంతమైంది. ఆ తరువాత సింగీతం విజయ పరంపర, ప్రయోగ పరంపర సమాంతరంగా సాగాయి.
ముఖ్యంగా కమల్ హాసన్‌తో సింగీతం సొమ్మొకడిది సోకొకడిది సినిమాతో ఆరంభించి పలు చిత్రాలను విజయవంతంగా తీశాడు. వాటిలో మైఖేల్ మదన కామరాజు కథ, అమావాస్య చంద్రుడు, అపూర్వ సహోదరులు ముఖ్యమైనవి.
సందేశాత్మకంగా తీసిన చిత్రాలలో తరం మారింది ముఖ్యమైంది. డైలాగులు లేకుండా తీసిన పుష్పక విమానం అన్ని "భాషలలో" ప్రదర్శించారు. మయూరి సినిమాలో "సుధా చంద్రన్" చరిత్రను సున్నితంగా తెరకెక్కించాడు. తెలుగులో వచ్చిన కొద్ది సైన్స్ ఫిక్షన్ (వైజ్ఞానిక కల్పన) సినిమాలలో ఆదిత్య 369 ఒకటి. భైరవద్వీపం సినిమాతో ప్రేక్షకులు మరచిపోతున్న జానపదచిత్రాలను గుర్తు చేశాడు. కన్నడంలో రాజకుమార్ ప్రధాన చిత్రాలలో శ్రావణబంతు ఒకటి.
సింగీతం శ్రీనివాసరావు ప్రసిద్ధ సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావుకు శిష్యుడు. 'భాగ్యద లక్ష్మి బారమ్మ', 'సంయుక్త' అనే రెండు విజయవంతమైన కన్నడ చిత్రాలకు శ్రీనివాసరావు సంగీత దర్శకుడు. ప్రవాస భారతీయుల పిల్ల సౌకర్యార్ధం 30 శ్లోకాలను ఆంగ్లంలో సంగీతపరంగా కూర్చాడు.
సింగీతం శ్రీనివాసరావు 2021 సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ హాలులో జరిగిన సాక్షి మీడియా 2019, 2020 ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్యక్రమంలో 2019గాను జీవితసాఫల్య పురస్కారం అందుకున్నాడు. ఆయన తరఫున ఈ అవార్డును దర్శకుడు గుణశేఖర్ అందుకున్నాడు.[4]
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)