హసన్ తిలకరత్నె

1967, జూలై 14న కొలంబోలో జన్మించిన హసన్ తిలకరత్నె (Hashan Prasantha Tillakaratne) శ్రీలంకకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు. పాఠశాలలో ఉన్నప్పుడే 1986లో ఇంగ్లాండు బి జట్టుపై గాలెలో ఆడటానికి ఎన్నికైనాడు. ఆ మ్యాచ్‌లో సెంచరీ సాధించి మ్యాచ్‌ను రక్షించాడు. అదే సంవత్సరం నవంబర్లో తొలి వన్డే మ్యాచ్‌ను ఆడినాడు. 1989 డిసెంబర్ నాటికి వికెట్‌కీపర్-బ్యాట్స్‌మెన్‌గా ఎదిగాడు. 1992 డిసెంబర్ తరువాత పత్యేక బ్యాట్స్‌మెన్‌గా అవతరించాడు.

1999 ప్రపంచ కప్ క్రికెట్ తరువాత శ్రీలంక టెస్టు, వన్డే జట్టులనుంచి తొలిగించబడ్డాడు. ఆ సమయములో దేశవాళీ క్రికెట్‌లో రాణించి మళ్ళీ 2001లో శ్రీలంక క్రికెట్ జట్టులో స్థానం సంపాదించాడు. 2002-03లో వన్డే పోటీలలో కూడా స్థానం పొందినాడు. 2003 ఏప్రిల్లో శ్రీలంక జట్టుకు నాయకత్వ హోదా కూడా పొందినాడు. కాని కాని నేతృత్వం వహించిన పదింటిలో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ నెగ్గినాడు. ఆస్ట్రేలియాపై 3-0 తో ఓడిన తరువాత 2004 మార్చిలో నాయకత్వానికి రాజీనామా చేశాడు. ప్రయత్నాలు చేసిననూ ఆ తరువాత మళ్ళీ జాతీయ జట్టుకు ఎంపిక కాలేడు.

2005 ఫిబ్రవరి 1న శ్రీలంక క్రికెట్ బోర్డు తిలకరత్నెను 2004 డిసెంబరులో సంభవించిన సునామీ బాధితుల సహాయంకై ఏర్పాటుచేసిన "క్రికెట్ నిధి" కార్యనిర్వాహక డైరెక్టర్‌గా నియమించింది.[1] ఆరోపణలు రావడంతో మధ్యలోనే సస్పెండ్ కావలసివచ్చింది.[2]

టెస్ట్ క్రికెట్ గణాంకాలు

[మార్చు]

తిలకరత్నె 83 టెస్టులు ఆడి 42.87 సగటుతో 4545 పరుగులు సాధించాడు. అందులో 11 సెంచరీలు, 20 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో అతని అత్యధిక స్కోరు 204 (నాటౌట్).

వన్డే క్రికెట్ గణాంకాలు

[మార్చు]

హసన్ తిలకరత్నె 200 వన్డేలలో జట్టుకు ప్రాతినిధ్యం వహించి 29.60 సగటుతో 3789 పరుగులు చేశాడు. అందులో 2 సెంచరీలు, 13 అర్థసెంచరీలు ఉన్నాయి. వన్డేలలో అతడి అత్యధిక స్కోరు 104 పరుగులు. బౌలింగ్‌లో 6 వికెట్లను కూడా సాధించాడు.

ప్రపంచ కప్ క్రికెట్

[మార్చు]

తిలకరత్నె తొలిసారిగా అరవింద డి సిల్వ నేతృత్వంలో 1992 ప్రపంచ కప్ క్రికెట్‌లో పోల్గొన్నాడు. ఆ తరువాత అర్జున రణతుంగ నేతృత్వంలో శ్రీలంక చాంపియన్ అయిన 1996 ప్రపంచ కప్‌లో కూడా పాల్గొన్నాడు. 1999, 2003 ప్రపంచ కప్ క్రికెట్‌లో కూడా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

మూలాలు

[మార్చు]
  1. http://content-aus.cricinfo.com/ci/content/story/144239.html
  2. http://content-aus.cricinfo.com/ci/content/story/217151.html