అడుసుమిల్లి జనార్ధన వరప్రసాద్ | |
---|---|
జననం | అడుసుమిల్లి జనార్ధన వరప్రసాద్ జనవరి 2, 1958 కోడూరు (ముదినేపల్లి) |
మరణం | 2015 జనవరి 4 హైదరాబాద్ | (వయసు 57)
మరణ కారణం | క్యాన్సర్ |
నివాస ప్రాంతం | హైదరాబాదు , సింధనూరు |
ఇతర పేర్లు | ఆహుతి ప్రసాద్ |
వృత్తి | నటుడు, నిర్మాత, బిల్డర్ |
పిల్లలు | ఇద్దరు కుమారులు , భరణి ప్రసాద్ కార్తీక్ ప్రసాద్[1][2] |
తల్లిదండ్రులు | రంగారావు, హైమవతి |
ఆహుతి ప్రసాద్ (జనవరి 2, 1958 - జనవరి 4, 2015) తెలుగు సినీ నటుడు. క్యారెక్టర్ నటునిగా, హాస్య నటునిగా గుర్తింపు పొంది 300 పైచిలుకు సినిమాల్లో నటించారు. 1983-84ల్లో మధు యాక్టింగ్ స్కూల్లో నటన నేర్చుకున్నాకా విక్రమ్తో నటునిగా పరిచయం అయ్యాడు. కొద్ది సినిమాల్లో, ఒక సీరియల్లో నటించాకా ఆహుతి (1987) సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆహుతి సినిమా ఘన విజయం సాధించింది, సినిమాలో ప్రసాద్ పోషించిన శంభు ప్రసాద్ పాత్రకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభించి అప్పటి నుంచి ఆహుతి ప్రసాద్ గా పేరొందాడు. ఆ తర్వాత అనేక సినిమాల్లో పోలీసు పాత్రలు, రాజకీయ నాయకుని పాత్రలు చేశాడు. 1990లో పోలీసు భార్య పునర్నిర్మాణం చేసి కన్నడంలో నిర్మాతగా మారి 3 సినిమాలు తీశాడు. తొలి సినిమా విజయవంతం అయినా, మిగతా సినిమాల పరాజయం పాలై అప్పుల పాలు చేశాయి. తెలుగులోనూ అవకాశాలు రాకపోడంతో దాదాపు 4 సంవత్సరాల పాటు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. నిన్నే పెళ్ళాడుతా (1996) సినిమాలో కథానాయిక తండ్రిగా చేసిన పాత్రతో తిరిగి సినిమా అవకాశాలు పెరిగాయి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను సినిమాలో నటనకు గాను 2002 సంవత్సరానికి గాను ఉత్తమ ప్రతినాయకుడిగా నంది పురస్కారం అందుకున్నాడు. చందమామ (2007) సినిమాలో పోషించిన రామలింగేశ్వరరావు పాత్ర హాస్యం, విభిన్నమైన సంభాషణ శైలితో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. చందమామలో నటనకు గాను 2007 సంవత్సరానికి ఉత్తమ క్యారెక్టర్ నటుడు - గుమ్మడి విభాగంలో నంది అవార్డు పొందారు. ఆ సినిమా తర్వాత కెరీర్ మళ్ళీ మలుపు తిరిగి పలు హాస్య పాత్రలు చేసే అవకాశం వచ్చింది. నిర్మాణ రంగంలో బిల్డర్ గా వ్యాపారం కూడా చేశాడు. 2015 జనవరి 4న క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మరణించాడు.
1958 జనవరి 2 న కోడూరు (ముదినేపల్లి)లో జన్మించారు. వారిది వ్యవసాయ కుటుంబం. నాన్న రంగారావు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆయనకు ముగ్గురు అక్కలు. అన్నదమ్ములెవరూ లేరు. కోడూరులో ఉన్న ఏడెనిమిది ఎకరాలు అమ్మేసి కర్నూలు సమీపంలో శాంతినగరం అనే చోట భూములు కొని మూడునాలుగేళ్ల వయసులోనే శాంతినగరానికి వచ్చేశారు. శాంతినగరానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని చంద్రశేఖరనగరం అనేచోట తాత, నాయినమ్మ కూడా ఉండేవారు. చివరికి రాయచూరు సమీపంలోని సింధనూరు దగ్గర పాండురంగ క్యాంప్‌లో స్థిరపడ్డారు. క్యాంపులో పెరిగినందువల్ల కన్నడ భాష బాగా పట్టుబడింది. ఆయన విద్యాభ్యాసం నాగార్జునసాగర్, డోన్, కోదాడ ప్రాంతాల్లో సాగింది. ఆయన కళాశాల విద్య కోదాడలో పూర్తిచేశారు. చిన్నతనం నుంచీ నటనపై ఆసక్తి ఉండేది. 9వ తరగతి చదువుతున్నప్పుడు అన్నాచెల్లెళ్ళు నాటకంలో తన నటనకు మొదటి బహుమతి రావడంతో నటుడు కావాలనే కోరిక ప్రారంభమై, అతనితో పెరిగి పెద్ద అయింది.[3]
1983 జనవరి 26న హైదరాబాద్‌లో ప్రారంభమైన మధు ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో ప్రసాద్ మొదటి బ్యాచ్ లో చేరాడు. నటుడు అచ్యుత్, శివాజీరాజా, రాంజగన్ వంటి నటులు ఆయన సహ విద్యార్థులుగా ఉండేవారు. వారికి దేవదాస్ కనకాల వంటివారు నటన నేర్పించేవారు. 1984లో డిప్లొమా పూర్తి కావడంతో తన బ్యాచ్ మేట్స్ అందరూ అప్పటికీ తెలుగు సినిమా పరిశ్రమ కేంద్రమైన మద్రాసు (నేటి చెన్నై) వెళ్ళి సినిమా ప్రయత్నాలు చేసుకుంటూండగా, పెళ్ళి అయి హైదరాబాద్ లోనే కాపురం పెట్టిన ప్రసాద్ మద్రాసు మారలేకపోయారు. ప్రసాద్ సమస్య గమనించిన మధుసూదనరావు మధు ఫిలిం ఇన్స్టిట్యూట్ నిర్వహణ బాధ్యతలు ఇచ్చారు.
కొన్నాళ్ల తర్వాత మధుసూదనరావు దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉషాకిరణ్ మూవీస్ వారి మల్లె మొగ్గలు సినిమాకి పనిచేశారు. ఆయన పనిచేస్తున్న రెండో సినిమా విక్రమ్ లో తొలిసారిగా నటించారు. తాతినేని ప్రకాశరావు దూరదర్శన్ కోసం చేస్తున్న మీరూ ఆలోచించండి కార్యక్రమంలో ప్రసాద్ కు అవకాశం ఇచ్చారు. ప్రతాప్‌ఆర్ట్స్ థియేటర్‌లో ఆ సినిమాకి డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళినపుడు అక్కడ వారికి రాఘవగారబ్బాయి ప్రతాప్ పరిచయమయ్యాడు. తర్వాత వాళ్ల బ్యానర్‌లో 'ఈ ప్రశ్నకు బదులేది' అనే సినిమా తీస్తున్నప్పుడు అందులో అతడిని విలన్‌గా తీసుకున్నారు.
నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి ఆ సినిమా ఫస్ట్‌కాపీ చూశారు. అప్పటికే ఆయన 'తలంబ్రాలు' తీశారు, రెండో సినిమాగా ఆహుతి నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 'ఈ ప్రశ్నకు బదులేది'లో ఆయన నటన ఆయనకు బాగా నచ్చి 'ఆహుతి'లో శంభుప్రసాద్ పాత్రకు తీసుకున్నారు. 1987లో విడుదలైన ఆహుతి సినిమా ఘనవిజయం సాధించడంతో పాటుగా అందులో శంభు ప్రసాద్ గా చేసిన పాత్ర ప్రసాద్ నట జీవితాన్ని మలుపుతిప్పింది. ఆంధ్రప్రభ పత్రికలో పనిచేసిన సినీ జర్నలిస్టు ఆంజనేయశాస్త్రి ఇంటర్వ్యూలో ఆహుతి ప్రసాద్ అని రాయడంతో ప్రారంభమై, అతని పేరు ఆహుతి ప్రసాద్ గా మారిపోయింది.
ఆహుతి ప్రసాద్ ఆహుతి సినిమా విజయాన్ని, తద్వారా తన పాత్రకు, తనకు లభించిన గుర్తింపునీ సరిగా ఉపయోగించుకోలేకపోయారు. కానీ సినిమా విజయంతో చాలా పాత్రలే వచ్చి, వాటిని చేసుకుంటూ వెళ్ళారు. ప్రసాద్ నటించిన పోలీస్ భార్య సినిమా విజయవంతం కావడంతో ఆ సినిమా హక్కులు కొని కన్నడలో నిర్మాణం చేశారు. విజయవంతం కావడంతో మరో రెండు సినిమాలు తీయగా అందులో ఒకటి దారుణమైన పరాజయం పాలైంది. దాంతో ఆర్థికంగా చాలా దెబ్బతిన్నాడు. మరోవైపు కన్నడ సినిమా నిర్మాతగా బిజీగా ఉన్నప్పుడు అందుబాటులో ఉండడేమోనన్న ఉద్దేశంతో తెలుగులో పాత్రలు తగ్గిపోయాయి. నాలుగు సంవత్సరాల పాటు ఎటూ కాని స్థితి ఎదుర్కొన్నారు.
1996లో దర్శకుడు కృష్ణవంశీ తన నిన్నే పెళ్ళాడతా సినిమాలో కథానాయిక టబు తండ్రిగా ప్రాధాన్యత ఉన్న పాత్ర ఇవ్వడంతో మళ్ళీ సినిమా అవకాశాలు రావడం ప్రారంభం అయ్యాయి. స్థిరాస్థి వ్యాపారంలోకి ప్రవేశించి, ఇటు సినిమాల్లో తండ్రి పాత్రలు, పోలీసు అధికారి పాత్రలు చేయడం కొనసాగించారు. దాదాపు దశాబ్ది కాలం పాటు అటువంటి పాత్రలు పోషించారు.
తిరిగి 2007లో కృష్ణవంశీ చందమామ సినిమాలో కథానాయకుడి తండ్రి రామలింగేశ్వరరావు పాత్ర ఇచ్చారు. గోదావరి జిల్లా యాసలో విలక్షణమైన నటనతో చెప్పిన డైలాగులు సినిమా విజయానికి తోడ్పడడంతో ఆహుతి ప్రసాద్ కెరీర్ మరో మలుపు తిరిగింది. కొత్తబంగారులోకం, బెండు అప్పారావు, సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం వంటి సినిమాల్లో హాస్యాన్ని పండించే పాత్రలు పోషించారు.[3][4]
1982లో విజయనిర్మలతో ప్రసాద్ వివాహం జరిగింది. వారి కొడుకులు భరణి, కార్తీక్ విదేశాల్లో స్థిరపడ్డారు.[3]
నేను నిన్ను ప్రేమిస్తున్నాను సినిమాలో ప్రతినాయక పాత్రలో ఆహుతి ప్రసాద్ నటనకు గాను 2002 సంవత్సరానికి ఉత్తమ ప్రతినాయకుడుగా నంది పురస్కారం అందుకున్నారు.[5] 2007 సంవత్సరానికి గాను నంది పురస్కారాల్లో ఉత్తమ క్యారెక్టర్ నటుడు - గుమ్మడి పురస్కారాన్ని చందమామ సినిమాలో రామలింగేశ్వరరావు పాత్రలో నటనకు గాను అందుకున్నారు.[6]
గత కొంతకాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని కిమ్స్ చికిత్స పొందుతూ 2015, జనవరి 4 ఆదివారం మధ్యాహ్నం మరణించారు.