వేటూరి గా పిలవబడే వేటూరి సుందరరామ్మూర్తి (జనవరి 29, 1936 - మే 22, 2010) సుప్రసిద్ధ తెలుగు సినీ గీత రచయిత. వేటూరి దైతా గోపాలం ఆ తర్వాత మల్లాది వద్ద[1] శిష్యరికం చేశారు. తొలినాళ్ళలో పాత్రికేయునిగా పనిచేసిన వేటూరి కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీత కథ ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. తర్వాత కొన్ని వేల పాటలను రాశారు. వేటూరి సుందరరామ్మూర్తి 6 నంది అవార్డులతో పాటు మొత్తం 14 అవార్డులు, ఒక జాతీయ పురస్కారం అందుకున్నారు. తెలుగు పాటకు శ్రీశ్రీ తర్వాత జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టింది వేటూరియే.[2]
కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీత కథ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన వేటూరి, సంగీత జ్ఞానాన్నీ పదరచనల బాణీల్నీ స్పష్టంగా వంటబట్టించుకొని ఆ బాణీలతో సినిమాపాటకు వోణీలు వేయించారు. సాంప్రదాయ కీర్తనల్లోని పల్లవుల్ని, పురాణసాహిత్యంలోని పంక్తుల్నీ గ్రహించి అందమైన పాటల్ని అలవోకగా రచించడంలో ఆయన అసాధ్యుడు. వేటూరి అనగానే వెంటనే స్ఫురించేది అడవి రాముడు, శంకరాభరణం. ఇంకా సిరిసిరిమువ్వ, సాగరసంగమం, సప్తపది, సీతాకోకచిలుక, ముద్దమందారం, సితార, అన్వేషణ, స్వాతిముత్యం, ఇలా ఎన్నో సినిమాలు...ఈ సినిమాలలోని అందమయిన అద్బుతమయిన పాటలు! “పిల్లనగ్రోవికి నిలువెల్లగాయాలు అల్లన మ్రోవిని తాకితే గేయాలు” “నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడిబొమ్మా ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ” ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు స్పందించు నవనాడులే వీణాగానాలు కదులు ఎదలోని సడులే మృదంగాలు ఇలాంటి అపురూప పదవిన్యాసాలు ఆయన పాటల్లో అడుగడుగునా కనిపిస్తాయి.
వేటూరి చాలా రకాల పాటలను రాశాడు. సంప్రదాయ కవిత్వం దగ్గర నుండి జానపద గీతాల వరకు అన్నింటిలోనూ తన ప్రతిభను నిరూపించుకున్నారు. పండితుల నుండి పామరుల వరకు అందరిని అలరించిన విశిష్ట శైలి ఈయన సొంతం. శ్రీశ్రీ తర్వాత తెలుగు సినిమా పాటకి జాతీయ ఉత్తమ సినిమా పాటల రచయిత పురస్కారాన్ని అందించారు. ఆయన మాతృదేవోభవ సినిమాకి రాసిన రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే... అనే పాటకి 1994వ సంవత్సరానికి గాను ఈ పురస్కారం వచ్చింది. ఇది తెలుగు పాటకు రెండవ జాతీయ పురస్కారం. అయితే కేంద్ర ప్రభుతం తెలుగు భాషకు ప్రాచీన భాషా హోదా ఇవ్వనందుకు నిరసనగా తన పాటకు వచ్చిన జాతీయ పురస్కారాన్ని తిరిగి ఇచ్చి వేసిన మాతృ భాషాభిమానం ఈయన వ్యక్తిత్వ శైలికి ఒక మచ్చు తునక.
వేటూరి రేడియో కోసం రాసిన సంగీత నాటిక ఇది. రాయల నాటి తెలుగు సంస్కృతిని, ప్రజా జీవన సరళిని ప్రతిబింభించే కథ. కథా స్థలం కృష్ణా నదీ తీరాన ఆంధ్ర విష్ణు క్షేత్రంగా ప్రసిద్ధికెక్కినశ్రీకాకుళం.
ఉత్తమ సాహితీ సుగందాలు గుబాళించే అజరామర సినీ గీతాలను తెలుగు కళామతల్లి చరణ సుమాలుగా అర్పించి అర్చిస్తున్నసారస్వత మూర్తి నవనవోన్మేష విశిష్ట రచనా స్ఫూర్తి వేటూరి కలం నుండి పల్లవించిన ఎందఱో సినీ మహనీయుల ప్రస్తుతి వ్యాసాలే ఈ కొమ్మ కొమ్మకో సన్నాయీ.
సిరి సిరి మువ్వ (1978) (పాటలు: అందానికి అందం, ఎవరికెవరు ఈ లోకంలో, గజ్జె ఘల్లుమంటుంటే, ఝుమ్మంది నాదం సై అంది పాదం, మా ఊరి దేవుడమ్మా, ఒడుపున్న పిలుపు, రా దిగి రా దివి నుంచి భువికి దిగి రా)
ఆనంద్ (సినిమా) (2004) (పాటలు: వచ్చే వచ్చే నల్లమబ్బుల్లారా, యమునాతీరం, నువ్వేనా నా నువ్వేనా, చారుమతీ ఐ లవ్ యూ, తెలిసి తెలిసి వలలో పడినె మనసు, యదలో గానం)
గానం కోరుకునే గీతం వేటూరి - గాయకుడు కోరుకునే కవి వేటూరి—మంగళంపల్లి బాలమురళీకృష్ణ
యాభై సంవత్సరాలు పైబడిన నా సినీ జీవిత ప్రయాణంలో నాకు తారసపడిన మహాకవులు ఇద్దరే ఇద్దరు. ఒకరు కణ్ణదాసన్ ఇంకొకరు వేటూరి- 'రాజన్-నాగేంద్ర'
"పయనీర్ అన్నా, ట్రెండ్ సెట్టర్ అన్నా వేటూరి గారే! నేను కేవలం ఆయనకు కొనసాగింపు మాత్రమే"—సిరివెన్నెల సీతారామశాస్త్రి
"మొదటిసారి వేటూరి గారిని అనుకోకుండా చూసినప్పుడు ఒళ్లంతా చెమటలు పట్టేసి శరీరం వణికి పోయింది. ఆయన దగ్గరకు వెళ్లి నమస్కారం చేసి...”గోపికలు కృష్ణుని అవ్వాక్కయి అలా చూస్తూ ఉండిపోయారని పోతన గారు రాస్తే అతిశయోక్తి అనుకున్నానండి. కానీ ఇప్పుడు మీ ముందు నిలుచున్న నా పరిస్థితి అదే!" అని చెప్పి వచ్చేశాను". -- సిరివెన్నెల సీతారామశాస్త్రి
వేటూరి వారిపాటకి
సాటేదని సరస్వతిని చేరి కోర, నా
పాటేశ్వరుడికి వుజ్జీ
వేటూరేనంది నవ్వి వెంకటరమణా!